Anushka Parwani: నవజీవన యోగం

ABN , First Publish Date - 2023-07-29T03:59:00+05:30 IST

రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరిపోవాలన్నది చిన్ననాటి కోరిక. అనుకున్నట్టుగానే విమానం కాక్‌పీట్‌(Aircraft cockpit)లో కూర్చొని విహంగంలా విహరించింది. అంతలోనే ఓ ప్రమాదం... ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. పైలెట్‌ ఉద్యోగం(Pilot job) పోయింది. కానీ యోగా ట్రైనర్‌గా సరికొత్త అవతారం ఎత్తి... ఇప్పుడు బాలీవుడ్‌ బ్యూటీ(Bollywood beauty)లకు పాఠాలు చెబుతున్న అనుష్కా పర్వానీ(Anushka Parwani) అంతరంగం ఇది.

Anushka Parwani: నవజీవన యోగం

రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరిపోవాలన్నది చిన్ననాటి కోరిక. అనుకున్నట్టుగానే విమానం కాక్‌పీట్‌(Aircraft cockpit)లో కూర్చొని విహంగంలా విహరించింది. అంతలోనే ఓ ప్రమాదం... ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. పైలెట్‌ ఉద్యోగం(Pilot job) పోయింది. కానీ యోగా ట్రైనర్‌గా సరికొత్త అవతారం ఎత్తి... ఇప్పుడు బాలీవుడ్‌ బ్యూటీ(Bollywood beauty)లకు పాఠాలు చెబుతున్న అనుష్కా పర్వానీ(Anushka Parwani) అంతరంగం ఇది.

‘‘నేను కలలు కన్న జీవితం వేరు. ఇప్పుడు మీరు చూస్తున్న నా జీవితం వేరు. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను! కానీ ఏ రోజూ దేనికీ నేను చింతించలేదు. జీవితమంటేనే ఒక పాఠం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బోధిస్తూ ఉంటుంది. వాటి నుంచి నేర్చుకొంటూ... అది విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతుండాలి. నా అదృష్టం ఏంటంటే నాకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఇచ్చే అమ్మానాన్నలు ఉండడం. నా ప్రతి అడుగులోనూ... ప్రతి నిర్ణయంలోనూ వారు అండగా నిలిచారు. చిన్నప్పుడు మగపిల్లలతో కలిసి విపరీతంగా ఆడుతుండేదాన్ని. తరచూ గాయాలతో ఇంటికి వెళ్లేదాన్ని. కానీ ఇంట్లోవాళ్లు జాగ్రత్తలు చెప్పారే కానీ వద్దని వారించలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు రెండే ఇష్టాలు... ఒకటి పైలెట్‌ కావాలని. రెండోది స్విమ్మింగ్‌ నేర్చుకోవాలని. బాల్యంలో నేను ఆస్థమాతో బాగా బాధపడేదాన్ని. దాని నుంచి బయటపడాలంటే ఈత కొట్టమని డాక్టర్లయిన మా బామ్మ, తాతయ్య చెప్పారు. అలా చేస్తే లంగ్స్‌ బలపడతాయని, జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదని ఆ సలహా ఇచ్చారు. ఒక్కసారి నీళ్లలోకి దిగాక ఈత మీద ఇష్టం పెరిగిపోయింది. అది నా దైనందిన కార్యక్రమాల్లో భాగమైపోయింది. అంతేకాదు... నాకున్న ఆస్థమాను అధిగమించి ఎంతటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనగలనన్న ఆత్మస్థైర్యం ఇచ్చింది.

కల నెరవేరినా...

వేగం, పర్యాటకం అంటే నాకు చాలా ఆసక్తి. బహుశా అందుకేనేమో విమానం నడపాలనే కోరిక అధికమైంది. ఆకాశంలో పక్షులను చూసినప్పుడల్లా రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని ఉండేది. నాతోపాటే నా కల పెరుగుతూ వచ్చింది. అనుకున్నట్టుగానే శిక్షణ తీసుకున్నాను. పైలెట్‌ అయ్యి చాలా దేశాలు చుట్టి వచ్చాను. వేగంగా ఆకాశంలో దూసుకుపోతున్నప్పుడు, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నా మనసు ఆనందంతో పరవశించేది. కానీ అంతలోనే పెద్ద కుదుపు... నా ఆనందాన్ని ఆవిరి చేసింది.

నెలల తరబడి మంచంలోనే...

అది 2008. బైక్‌ మీద వెళుతూ ఉంటే యాక్సిడెంట్‌ జరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు చనిపోయానని అనుకున్నారు అందరూ. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాను. నెలల తరబడి మంచానికే పరిమితమయ్యాను. ‘అన్‌ఫిట్‌’ కావడంతో నా పైలెట్‌ ఉద్యోగం పోయింది. ఒకవైపు శరీరమంతా గాయాలతో లేవలేని పరిస్థితి... మరోవైపు ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించుకున్న ఉద్యోగం పోయిన బాధ... నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఒక్కసారిగా అంతటి దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను. భరించలేనంత మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయాను.


Anushka-Parwani-1.jpgయోగా ఇచ్చిన జీవితం...

అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న నాకు మా అమ్మ కొండంత అండగా నిలబడింది. తను యోగా టీచర్‌. నిద్ర లేని రాత్రుల నుంచి బయటపడడానికి నా జీవితంలో యోగాను ఒక భాగం చేసింది. యోగా నాకు కొత్తేమీ కాదు. ఆస్థమాను నియంత్రణలో పెట్టడానికి చిన్నప్పటి నుంచి ప్రాణాయామంతో పాటు కొన్ని ఆసనాలు కూడా చేయడం అలవాటు. అయితే తరువాత అదే యోగా నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది. యాక్సిడెంట్‌ గాయాల నుంచి మామూలు మనిషిని కావడానికి ఫిజియోథెరపీ సెషన్స్‌ ఉండేవి. అవి పూర్తవ్వగానే అమ్మ నాకు యోగా థెరపీ మొదలుపెట్టింది. నా గాయాలు బ్యాండేజీలు కట్టి, మందులు వేస్తే మానేవి కావని తను చాలా ముందే గ్రహించింది. దానికితోడు మానసికంగా కుంగిపోయిన నాకు అన్ని రకాలుగా యోగానే తగిన చికిత్స అని అమ్మ భావించింది.

మళ్లీ మొదలైంది...

గతాన్ని మరిచిపోయి... కొత్తగా జీవితం ప్రారంభించమని అమ్మ చెప్పింది. నిజమే... పాతవి తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఉండదు కదా. ఆ మరుక్షణమే నా అడుగులు యోగా స్కూలు వైపు పడ్డాయి. తొమ్మిది నెలల సుదీర్ఘ శిక్షణ తరువాత యోగా టీచర్స్‌ ట్రైనింగ్‌ సర్టిఫకెట్‌తో బయటకు వచ్చాను. అంతేకాదు... యోగా నా జీవితంలో భాగమయ్యాక వెన్ను నొప్పి లేని ఉదయాలు చూడడం ప్రారంభించాను. గతంలోలాగా పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయినా, ఊహించిన దాని కంటే ఎంతో మెరుగయ్యాను. నిజంగా యోగా నా జీవితంలో అద్భుతమే చేసింది. నాకు సరికొత్త రెక్కలు తొడిగింది.

బాలీవుడ్‌కు యోగా టీచర్‌...

శిక్షణ తీసుకున్న తరువాత నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. కొన్నాళ్లకు యోగా స్టూడియో ఒకటి ప్రారంభించాను. అందులో హఠ యోగా, అష్టాంగ విన్యాస లాంటివి సాధన చేయిస్తున్నాను. ప్రత్యేకంగా పిల్లల కోసం తేలికపాటి వ్యాయామాలు జోడించి యోగా సెషన్స్‌ నిర్వహిస్తున్నాను. దీపికా పడుకొనె, అలియా భట్‌, కరీనా కపూర్‌, అనన్యా పాండే తదితర బాలీవుడ్‌ స్టార్స్‌కు యోగా ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నా. దీపిక నటించిన ‘గహరాయియా’ సినిమాకు యోగా సీక్వెన్స్‌లు కొరియోగ్రఫీ చేశాను. దానికి గానూ ఎన్నో ప్రశంసలు, అభినందనలు అందుకున్నాను. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. యోగా గురువుగా, పారిశ్రామికవేత్తగా నా లక్ష్యం ఒక్కటే... యోగా ద్వారా నేటి తరాన్ని ఆరోగ్యకర జీవన విధానం వైపు నడిపించడం. ఆ దిశగా నేను సాధించాల్సింది చాలా ఉంది.’’

Updated Date - 2023-07-29T03:59:00+05:30 IST