Share News

Dharma path : తార. .సకల భాగ్యప్రదాత

ABN , First Publish Date - 2023-11-23T23:40:30+05:30 IST

సృష్టి కారకుడైన పరమాత్మ శక్తిశాలి... కానీ నిరాకారస్వరూపుడు. అయితే పరమాత్మ శక్తి అపరిమితమైనది, అది క్రియాశీలశక్తి. ఆ శక్తి ద్వారానే ఆయన సకల చరాచరాలనూ సృష్టించాడు. ఆ శక్తినే మనం మాతృరూపంలో పూజిస్తాము.

Dharma path : తార. .సకల  భాగ్యప్రదాత

సృష్టి కారకుడైన పరమాత్మ శక్తిశాలి... కానీ నిరాకారస్వరూపుడు. అయితే పరమాత్మ శక్తి అపరిమితమైనది, అది క్రియాశీలశక్తి. ఆ శక్తి ద్వారానే ఆయన సకల చరాచరాలనూ సృష్టించాడు. ఆ శక్తినే మనం మాతృరూపంలో పూజిస్తాము. మహాయాన బౌద్ధంలో చాలామంది దేవతల వర్ణనలు మనకు కనిపిస్తాయి. ఆర్య తార బౌద్ధమతంలో ఒక ముఖ్యమైన దేవత. ఆమెనే ‘శ్యామతార’ లేక ‘జెట్సున్‌ డోల్మా’ అని కూడా అంటారు. ముఖ్యంగా టిబెట్‌లోని బౌద్ధమతంలో ఆర్య తార ప్రధాన దేవత. ఆమె మహాయాన బౌద్ధమతంలో స్త్రీ బోధిసత్వురాలిగా, వజ్రయాన బౌద్ధమతంలో స్త్రీ బుద్ధుడిగా దర్శనమిస్తుంది. ఆమెను ‘మోక్షమాత’ అని కూడా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా, ఏ విజయం సాధించాలన్నా ఈ మాతను పూజించడం చాలా అవసరం. ఆర్య తార విజయాలను ప్రసాదించే తల్లి. ఆమెను చైనాలో ‘దువోల్వో పూసా’ అని పిలుస్తారు. జపాన్‌లో ‘తారా బోసత్సు’ అని అంటారు.

మాతృ దేవతలను పూజించే ఆచారం భారతదేశంలో చాలా కాలంగా వస్తున్నది. ఈ ఆరాధనల గురించి మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. సింధు నాగరికతలో పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని స్త్రీ శిల్పాలను కనుగొన్నారు. మొదట తర్జన భర్జనలు కొనసాగాక... ఆ శిల్పాలు మాతృ దేవతలవేనీ, వారు సంతానప్రదాతలైన దేవతలని గుర్తించారు. ‘బౌద్ధమతంలో ఈ దేవీ ఆరాధనలేమిటి?’ అని కొందరు ఆశ్చర్యపడవచ్చు. మనకు తెలిసింది కేవలం స్థవిరవాద బౌద్ధమే. బౌద్ధం అంటే కేవలం స్థవిరవాదమే అనుకుంటే చాలా పొరపాటు. ప్రపంచంలో అతి విస్తృతంగా వ్యాపించినవజ్రయాన బౌద్ధం భారత దేశంలో ఒకప్పుడు వెలుగొందిన ప్రధాన బౌద్ధ శాఖ. టిబెట్‌లో ఈ వజ్రయాన బౌద్ధశాఖే విస్తరించింది. తార... ఆధ్యాత్మిక సాధకులు నిరంతరం పూజించే ధ్యాన దేవత. తారా మాత అంతర్గత శక్తులను పెంపొందించడానికి, కరుణ, మైత్రి భావనలు పెంపొందించడానికి సహకరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా తథాగతుడు ప్రవచించిన శూన్యతను అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. బౌద్ధమతంలోని కొన్ని శాఖలు ఏకవింశతి (ఇరవై ఒక్క) తారలను గుర్తించాయి. ఈ దేవతలను పూజించే మంత్రం.... టిబెట్‌లో చాలా ముఖ్యమైన మంత్రం. ఏకవింశతి తారలు అన్ని ముఖ్య విజయాలకు మూలం. ఈ తార తథాగతులకు తల్లి, అన్ని విధులకు మూలం. ప్రధాన తార మంత్రం బౌద్ధులకు, హిందువులకు ఒకే విధంగా ఉంటుంది. టిబెట్‌లోని మహాయాన సంప్రదాయానుసారం... బోధిసత్వుడి కరుణాస్వరూపమే తారగా అవతరించింది. ఆమె అవలోకితేశ్వరుని స్త్రీశక్తి. అవలోకితేశ్వరుని కన్నీళ్ల నుండి జన్మించింది. అంతేకాదు... ధవళ తార చైనీస్‌ యువరాణి కొంగ్జోగా జన్మించింది. తారను రక్షకురాలుగానూ భావిస్తారు.

తారా దేవి బౌద్ధ దేవతా? లేక హిందూ దేవతా? అనేది ఇంకా పరిశోధనాంశంగానే మిగిలిపోయింది. మల్లర్‌ ఘోష్‌ అనే విద్వాంసుడు ‘‘ఆమె హిందూ పురాణాలలోని దుర్గా దేవతే’’ అన్నారు. తార బౌద్ధమతం, హిందూమతం రెండింటిలోనూ పది మహావిద్యాదేవతలలో ఒకరిగా పూజలు అందుకుంటోంది. తారాదేవి ప్రజ్ఞాపారమిత జ్ఞానానికి మూర్తిరూపమనే నమ్మకం అనంతర కాలంలో ప్రారంభమై ఉంటుంది. ఈ అమ్మవారిని గురించిన మొదటి ప్రస్తావన ‘మంజూశ్రీ-మూలకల్పం’ అనే గ్రంథంలో కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఎల్లోరా గుహల్లో... ఆరవ నెంబర్‌ గుహ దగ్గర నెలకొన్న తారాదేవి శిలాప్రతిమ... మనకు లభించిన మొట్టమొదటి అవశేషమని పురావస్తు-తత్వవేత్తలు భావిస్తున్నారు.

ఎనిమిదో శతాబ్దంలో... పాల వంశ రాజుల పాలనలో... బౌద్ధ తంత్రయాన ఆవిర్భావం జరిగిన తరువాత... తారాదేవికి ఆదరణ పెరిగింది. క్రమంగా ఆ దేవి వజ్రయాన దేవతగా మారిపోయింది. ఆ తరువాత కాలంలో సకల బుద్ధుల తల్లిగా పరిగణన పొందింది. అంటే తార వల్లనే గౌతమ బుద్ధునికి, అంతకు పూర్వం ఉన్న బుద్ధులకు జ్ఞానోదయం కలిగిందంటారు. హరిత తార, ధవళతార దేవతలు... బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన తారా రూపాలు. హరిత తార సాధారణంగా భయం, అహంకారం, మాయ/ అజ్ఞానం, ద్వేషం, కోపం, అసూయ, మతోన్మాద దృక్పథం, బానిసత్వం, దురభిమానం, లోభం, కోరికల నుంచి, దుష్టాత్మల నుంచి మనల్ని రక్షిస్తుంది. ధవళతార (సరస్వతి) దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది. అనారోగ్యాన్ని పారద్రోలి, సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆమె కరుణామూర్తి. చంద్రుడిలా తెల్లగా, ప్రకాశవంతంగా ఉంటుంది. తారను పూజించడం వల్ల మనోభీష్టాలూ సిద్ధిస్తాయి.

ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం

Updated Date - 2023-11-23T23:40:37+05:30 IST