Share News

Eid Traditions: పంచుకుంటేనే పండుగ

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:33 AM

రంజాన్‌ పర్వదినాన ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యాచరణ పవిత్ర గ్రంథాల్లో సూచించబడింది. ఉదయాన్నే లేచి శుచిగా ఉండటం, తలంటు స్నానం, నమాజ్‌ ముందు ఫిత్రా దానం చేయడం ముఖ్యమైనవి. ఈద్‌ నమాజ్‌ పూర్తయిన తరువాత బంధు మిత్రులతో విందు భాగస్వామ్యం చేసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతుంది.

Eid Traditions: పంచుకుంటేనే పండుగ

సందేశం

పండుగ అంటే మన బంధుమిత్రులతో కలిసి మనం మాత్రమే వేడుక చేసుకోవడం కాదు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న నిరుపేదలను, ఆర్తులను కూడా ఆ సంబరాల్లో భాగస్వాములుగా చేయడం. మనకు ఉన్నదాన్ని వారితో పంచుకోవడం. అందరి సంతోషమే అల్లా్‌హకు ప్రీతికరమని తెలుసుకోవడం. రంజాన్‌ పండుగ ఇచ్చే సందేశం అదే.

స్లాం ధర్మంలో పండుగలు రెండు మాత్రమే. ఒకటి ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌), రెండోది ‘ఈద్‌-ఉల్‌-అజ్‌హా’ (బక్రీద్‌). రంజాన్‌ను ‘ఫిత్రాల పండుగ’ అని కూడా అంటారు. అంటే పేదలకు ఫిత్రా దానాన్ని చెల్లించే పండుగ. ఒక ఫిత్రా దానం విలువ రెండున్నర కిలోల గోధుమల విలువకు సమానమై ఉంటుంది. దీన్ని సాధారణ వ్యక్తుల నుంచి సంపన్నుల వరకూ కచ్చితంగా చెల్లించాలనేది నియమం. రంజాన్‌ మాసంలో చేసిన ఉపవాసాల్లో దొర్లిన చిన్న చిన్న లోటుపాట్లను ఫిత్రాదానం భర్తీ చేస్తుందని దైవప్రవక్త మహమ్మద్‌ తన బోధనల ద్వారా తెలియజేశారు. మరోవైపు నిరుపేదలకు ఇది సంతోషాన్ని పంచుతుంది. పరస్పర దయ, సహకార గుణాలను పెంచుతుంది. హృదయాలను శుద్ధి చేస్తుంది. లోభత్వాన్ని అరికడుతుంది.


ఇలా చేయాలి

రంజాన్‌ పర్వదినాన చేయవలసిన పనులను పవిత్ర గ్రంథాలు నిర్దేశించాయి. వాటి ప్రకారం: ఉదయాన్నే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఫజ్ర్‌ నమాజ్‌కు ముందు కానీ, తరువాత కానీ తలంటు స్నానం చేయాలి. ఉన్నవాటిలో మంచి దుస్తులు ధరించాలి. సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. వ్యక్తిగత అలంకరణ చేసుకోవాలి. కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి. ఈద్‌ నమాజ్‌కన్నా ముందే జకాత్‌, ఫిత్రా దానాలను చెల్లించాలి. తీపి పదార్థాన్ని, బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లను తినాలి. ఈద్గా మైదానానికి వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళాలి, వేరే దారిలో తిరిగి రావాలి. ఈద్‌ నమాజ్‌కు వెళ్తున్నప్పుడు ‘తక్బీర్‌’ (స్తుతి)ని మెల్లగా పలుకుతూ ముందుకు సాగాలి. కాలినడకన ఈద్గాకు వెళ్ళడం పుణ్యప్రదం. నమాజ్‌ తరువాత ఒకరికొకరు సలాం చెప్పుకోవాలి. ఈద్‌ నమాజ్‌ను బస్త్రీ లేదా గ్రామం బయట ఉండే బహిరంగ ప్రదేశంలో... అంటే ఈద్గాలో చేయడం సున్నత్‌ ప్రవక్త సంప్రదాయం. ఆ సౌకర్యం లేనప్పుడు మసీదులో కూడా చేయవచ్చు. నమాజ్‌ పూర్తయ్యాక... బంధు మిత్రులతో కలిసి విందుతో సంతోషంగా గడపాలి.

రంజాన్‌ను ‘ఫిత్రాల పండుగ’ అని కూడా అంటారు. అంటే పేదలకు ఫిత్రా దానాన్ని చెల్లించే పండుగ. ఒక ఫిత్రా దానం విలువ రెండున్నర కిలోల గోధుమల విలువకు సమానం.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


ఇవి కూడా చదవండి:

తృటిలో తప్పిన ప్రమాదం

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 28 , 2025 | 02:47 AM