Ugadi 2025 Significance: నవ చైతన్యానికి నాంది
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:45 AM
ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ. ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పంచాంగ శ్రవణం ద్వారా గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

పర్వదినం
30న విశ్వావసు నామ ఉగాది
ప్రభవ నుంచి అక్షయ వరకు గల అరవై సంవత్సరాలలో 39వదైన విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. చైత్రమాస ఆగమనంతో ప్రకృతి పులకిస్తుంది. అంతటా కొత్తదనం సంతరించుకుంటుంది. నవచైతన్యానికి నాంది అవుతుంది. అనంతమైన కాలంలో సంవత్సరం ఒక ప్రమాణం. మానవ జీవనానికి, కాలస్వరూపుడైన ఆ పరమాత్మకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. తదనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
చాంద్రమానం అనుసరించే తెలుగువారి సంవత్సరాది... ఉగాది. సంస్కృత పదమైన ‘యుగాది’ కాలక్రమంలో ‘ఉగాది’ అయింది. ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. అలా ఉగాది చాంద్రమాన నక్షత్ర గమనంతో రూపుదిద్దుకున్నదనేది ఖగోళ, జ్యోతిష శాస్త్ర ప్రమాణం. ఇదే విషయాన్ని హేమాద్రి పండితుడు ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథంలో ప్రస్తావిస్తూ... బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా దీన్ని పేర్కొన్నాడు. అఖండ దేవుడు తన ‘స్మృతి కౌస్తుభం’ గ్రంథంలో ‘‘చాంద్రమాన సంవత్సరంలోని తొలి మాసమైన చైత్రమాసంలో... తొలి తిథి అయిన పాడ్యమి- ఉగాది’’ అని తెలిపాడు. ఈ రోజునుంచి వసంత ఋతువు ఆరంభమవుతుంది.
విధి విధానాలు, ఉగాది పచ్చడి...
కొత్త సంవత్సరం మొదలైన సందర్భంలో... ఆచరించవలసిన విధి విధానాలను మన పూర్వ ఋషులు ఎన్నడో నిర్దేశించారు. దాని ప్రకారం... ప్రాతఃకాలంలో అభ్యంగన స్నానం చేయడం ఉగాదినాటి తొలి నియమం. దానికి ముందు ఇంటిలోని పెద్దవారితో తలకు నూనె పట్టించుకొని, వారి ఆశీస్సులు పొంది, స్నానం చేయడం వల్ల అలక్ష్మి తొలగిపోతుందనీ. లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందని పూర్వులు చెప్పారు. అలాగే నూతన వస్త్రాలు ధరించడం, దైవారాధన చేయడం, ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి పరగడుపున ఆరగించడం, పెద్దల ఆశీస్సులు పొందడం లాంటివి విధులుగా నిర్దేశించారు.
ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం. అది అమృత సమానం. విశేషమైన రోగ నిరోధక శక్తి కలిగినది. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే, ఏడాదంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పంచాంగ శ్రవణం
అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే అయిదు అంగాలను కలిగినది. ఏడాది కాలాన్ని ప్రమాణంగా చేసుకొని... ఆ కాలంలో గ్రహాల సంచారం, అవి కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోయే శుభాశుభ ఫలితాలు, రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు... ఇలా పలు విషయాలు పంచాంగంలో సవివరంగా ఉంటాయి. అలాగే గ్రహ సంచారాలు, నక్షత్ర గమనం, పండుగల నిర్ణయం, శుభ ముహూర్తాలు... ఇవన్నీ పంచాంగాన్ని అనుసరించే ఉంటాయి. ముఖ్యంగా కర్తరీ నిర్ణయం సూర్యుడి ఆధారంగా జరుగుతుంది. వాతావరణ మార్పులను సూచించే కర్తరీ నిర్ణయం కర్షకులకు ఎంతో ముఖ్యం. ఇవే కాకుండా, గ్రహణాలు, పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. గ్రహాలు పరమాత్ముని అధీనంలో ఉంటాయి. పంచాంగ శ్రవణం చేసి, పరమాత్ముని ప్రార్థించినవారికి ఆయన కృప నిస్సంశయంగా కలుగుతుంది. మనం నిత్యం చేసే పూజా విధిలో ఈ అయిదు అంగాలను స్మరించుకోవడమే సంకల్పం. తిథి... శ్రేయస్సును ఇస్తుంది. వారం... ఆయుష్షును కలిగిస్తుంది. నక్షత్రం... పాపాలను తొలగిస్తుంది. యోగం... రోగాలను తొలగిస్తుంది. కరణం... కార్యాలకు విజయం చేకూరుస్తుంది. అందుకే పంచాంగాన్ని ఒక ఏడాదికి సంబంధించిన ‘కాల విజ్ఞాన సర్వస్వం’ అని చెప్పవచ్చు.
- ఆయపిళ్ల రాజపాప
ఇవి కూడా చదవండి..
Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు