Ugadi Awakening: కొత్తదనాన్ని ఆహ్వానిద్దాం
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:13 AM
ఉగాది పండుగ కొత్తదనానికి నాంది పలుకుతుంది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధన ప్రారంభించడం శుభప్రదమని, సహజయోగం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేసుకుంటే నవగ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చని నిర్మలాదేవి వివరించారు

సహజయోగ
వసంత ఋతువు ఆగమనం, లేత మామిడి చిగుళ్ళు, మధురమైన కోయిల గానం... ఇవన్నీ ఉగాది పర్వదినానికి ప్రకృతి సహజమైన అలంకారాలు. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు, బంధు మిత్ర సమాగమం లాంటివన్నీ సన్మార్గంలో నడవడానికి ఏర్పరచుకున్న సంప్రదాయాలు. వీటన్నిటి సంగమమైన ఉగాది ఒక ఆహ్లాదకరమైన పర్వదినం. మంచి పనులను మొదలుపెట్టడానికి ఈ రోజు ఎంతో శ్రేష్టమైనది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉగాది పండుగ విశిష్టత గురించి శ్రీమాతాజీ నిర్మలాదేవి చేసిన ప్రవచనాలను గుర్తు చేసుకుందాం.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి... ఉగాది. చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తే... ఆమె అనంతమైన కృపకు పాత్రులం కాగలం. ఎన్నో గొప్ప విషయాలకు ఇదే తొలి రోజు అని మన పూర్వీకులు పేర్కొన్నారు..
ఆదిశక్తి సృష్టి రచనను ఈ రోజే మొదలుపెట్టిందనీ, గణేశుణ్ణి ఆమె సృష్టించినది ఈ రోజేననీ, కాలం ఈ రోజే ప్రారంభమయిందనీ పలు గ్రంథాలు చెబుతున్నాయి. ఉగాది రోజును ధ్యానం, పూజ, ప్రార్థనలతో ప్రారంభించాలని సూచించారు. ఆధ్యాత్మిక జీవనంలో కొత్త అధ్యాయాలను, ప్రారంభించడానికి ఇది ఎంతో అనువైన రోజు. అలాగే మన జీవితం పట్ల గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని, వాటిని అనుకూలపరచుకోవడం ద్వారా ఉన్నతి పొందడం ఎలాగనేది అర్థం చేసుకోవడం ప్రధానం.
‘‘జ్యోతిష శాస్త్రం ప్రకారం... నవగ్రహాల వల్ల మన సూక్ష్మ శరీరంలో ఉండే వివిధ శక్తి కేంద్రాలు ప్రభావితమవుతాయి. మూలాధార చక్రాన్ని కుజుడు లేదా మంగళుడు, స్వాధిష్ఠాన చక్రాన్ని బుధుడు, మణిపూర చక్రాన్ని గురువు, అనాహత చక్రాన్ని శుక్రుడు, విశుద్ధ చక్రాన్ని శని, ఆజ్ఞా చక్రాన్ని సూర్యుడు, సహస్రార చక్రాన్ని చంద్రుడు, రాహు కేతువులు ప్రభావితం చేస్తారు. సహజ యోగ ధ్యానం ద్వారా ఆ చక్రాలను లేదా శక్తి కేంద్రాలను శుద్ధి చేసుకున్నప్పుడు... సంబంధిత గ్రహాల దుష్ప్రభావం మన జాతకంలో ఉంటే తొలగిపోతుంది. అలాగే శక్తి కేంద్రాల మీద జాతి రత్నాల ప్రభావం కూడా ఉంటుంది.
మూలాధార చక్రంపై పగడం, స్వాధిష్ఠాన చక్రంపై కనక పుష్యరాగం, మణిపూర చక్రంపై పచ్చ, అనాహత చక్రంపై కెంపు, విశుద్ధ చక్రంపై నీలం, ఆజ్ఞా చక్రంపై వజ్రం, సహస్రార చక్రంపై ముత్యం ప్రభావాన్ని చూపుతాయి. ఆ రత్నాలను ఉపయోగించడం ద్వారా ఆయా చక్రాలను శుద్ధి చేసుకోవచ్చని, అవి శుద్ధి అయినప్పుడు... ఆ గ్రహాల శుభ దృష్టి మానవులకు లభిస్తుంది’’ అని నిర్మలాదేవి తెలిపారు.
ఆధ్యాత్మికంగా మానవుడి అత్యున్నత లక్ష్యం... తను సృష్టించిన పరమాత్మతో అనుసంధానం కావడమే. దీనికోసం మానవులలోని కుండలినీ శక్తి జాగృతమై, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి, సర్వవ్యాపితమైన భగవంతుని శక్తితో ఐక్యం కావాలి. ఈ మార్గంలో ఉండే ఆరు చక్రాలను కుండలినీ శక్తి దాటాలంటే... సాధకుడు శుభ లక్షణాలను సంతరించుకోవాలి. దీనికి నవగ్రహాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు... శని గ్రహం మన విశుద్ధ చక్రం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ చక్రాన్ని కుండలినీ శక్తి దాటాలంటే... మానవులకు వైరాగ్య భావం, ప్రతిదాన్నీ సాక్షిలా చూడగలిగే స్వభావం ఉండాలి.
పరిపూర్ణ ఆత్మ స్వరూపుడై... పరమాత్మను తనలో ప్రతిబింబించే వ్యక్తి... కష్ట సుఖాలను సమానంగా చూస్తాడు. అలాంటి వ్యక్తులపై శని అశుభ దృష్టి పని చేయదు. ఇదే విధంగా సహజయోగ సాధన ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేసుకున్న వ్యక్తి మీద నవగ్రహాల అశుభ ప్రభావం ఉండదని నిర్మలాదేవి వివరించారు. దీనికోసం సాధన ప్రారంభించడానికి, సాధనలో ఉన్నవారు మరింత దీక్షగా కొనసాగించాలనే సంకల్పం చేసుకోవడానికి వసంత ఋతువు అనువైన సమయం. ఈ సాధనకు శ్రీకారం చుట్టడానికి ఉగాది శుభప్రదమైన రోజు. కాబట్టి కొత్తదారిలో నడవడానికి, కొత్తదనాన్ని ఆహ్వానించడానికి సిద్ధమవుదాం.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఇవి కూడా చదవండి:
AP News: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..