USA: అమెరికా ప్రొఫెసర్ అకృత్యం.. షర్టులు విప్పండంటూ విద్యార్థినులపై వేధింపులు
ABN , First Publish Date - 2023-07-03T21:52:57+05:30 IST
విద్యార్థులను సక్రమమార్గంలో పెట్టాల్సిన ఓ అమెరికా ప్రొఫెసర్ కట్టుతప్పాడు. షర్టులు విప్పాలంటూ విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడి పాపం పండటంతో తాజాగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
ఎన్నారై డెస్క్: విద్యార్థులను సక్రమమార్గంలో పెట్టాల్సిన ఓ ప్రొఫెసర్ కట్టుతప్పాడు. షర్టులు విప్పాలంటూ విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డాడు. అమెరికాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 2019లో అతడీ అకృత్యాలకు దిగగా తాజాగా అతడిని అధికారులు విధుల నుంచి తప్పించారు.
మేరీల్యాండ్ రాష్ట్రానికి(Mary land) చెందిన ఓ ప్రొఫెసర్ వైద్యవిద్య భోధనలో భాగంగా ఈ పాడుపనికి దిగాడు. తరగతి గదిలో విద్యార్థినులు చొక్కాలు విప్పి నిలబడాలని ఆదేశించేవాడు(Professor forces female students to take off shirts). పాఠాలు చెప్పే క్రమంలో డెమాన్‌స్ట్రేషన్ పేరిట ఈ చర్యలకు పాల్పడ్డాడు. పరువు కాపాడుకునేందుకు విద్యార్థినులు ల్యాబ్ కోట్ ధరించేందుకు ప్రయత్నిస్తే వద్దని వారించేవాడు. పదుల సంఖ్యలో విద్యార్థినులు అతడి వేధింపులకు గురయ్యారు.
ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం బయటపడింది. ఘటనపై సీరియస్ అయిన యాజమాన్యం అతడిని తక్షణం విధులకు దూరం చేసి, సెలవులపై పంపించింది. మరోవైపు, ఈ ఆరోపణలపై అక్కడి విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో ఆ ఫ్రొఫెసర్ నిందితుడిగా తేలడంతో అతడిని తాజాగా విధుల నుంచి తప్పించారు(Professor fired). అంతేకాకుండా, ప్రొఫెసర్ వేధింపులతో ఒత్తిడికి గురై పరీక్షల్లో తప్పిన స్టూడెంట్స్‌కు మళ్లి చదువుకునేందుకు కూడా కాలేజీ యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇందుకు అయ్యే ఖర్చంతా భరించేందుకు ముందుకు వచ్చింది.