MLA Candidates : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. పొంగులేటి పరిస్థితేంటి..!?
ABN , First Publish Date - 2023-08-19T22:18:13+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలపై కసరత్తు చేస్తున్నాయి. శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తం చూసుకుని తొలిజాబితాని ఇవ్వాలని అధికార బీఆర్‌ఎస్ (BRS) కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ (Congress) ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. దీంతో ఆయా పార్టీల్లోని సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతోందన్న ప్రచారం జరగుతుండగా..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలపై కసరత్తు చేస్తున్నాయి. శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తం చూసుకుని తొలిజాబితాని ఇవ్వాలని అధికార బీఆర్‌ఎస్ (BRS) కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ (Congress) ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. దీంతో ఆయా పార్టీల్లోని సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతోందన్న ప్రచారం జరగుతుండగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి భరోసా ఇచ్చారని, జాబితా ప్రకటన తర్వాత అందరూ నియోజకవర్గాల్లోనే ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు 8చోట్లసిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Minister Puvvada Ajay Kumar) కాగా, పాలేరు, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాకల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరావు, బానోత్ హరిప్రియ, రేగా కాంతారావు ఉన్నారు. అలాగే సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఇక వైరానుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన రాములునాయక్ బీఆర్‌ఎస్ గూటిలోకే చేరారు.
తుమ్మల పరిస్థితి ఇదీ..
ప్రస్తుతం వీరందరూ ఈ సారి ఎన్నికల్లో తమకే టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. కానీ వైరా, పాలేరు, కొత్తగూడెంలో మార్పులుంటాయని, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రత్యర్థి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. వైరాలో మదన్‌లాల్, కొత్తగూడెంలో జలగం వెంకటరావు, పాలేరులో మాజీమంత్రి తుమ్మలను నిలుపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని, సీతారామ జలాలతో పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి రుణం తీర్చుకుంటానని ఇటీవల తుమ్మల ప్రకటించడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న మధిరలో జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ పేరు పరిశీలనలో ఉండగా, భద్రాచలంలో ఇటీవల కాంగ్రె్‌సలో చేరి మళ్లీ సొంతగూటికివచ్చిన తెల్లం వెంకటరావు పేరు ఖరారవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ వాజేడు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ బోదెబోయిన బుచ్చయ్యతో పాటు, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన మానె రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారి కొర్సా వెంకటేశ్వర్లు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
కాంగ్రెస్‌లో మొదలైన కుస్తీ..!
మరోవైపు కాంగ్రెస్‌లోనూ తొలి విడత జాబితాపై కుస్తీ మొదలైంది. మంచిరోజు చూసుకుంటున్నారని, శ్రావణమాసంలోనే ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఈ నెల 25వతేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి తొలి దరఖాస్తు అందింది. సత్తుపల్లి అభ్యర్థిత్వం కోసం మానవతారాయ్ దరఖాస్తును అందజేశారు. ఇక జిల్లాలో రెండు నియోజకవర్గాలు మినహా మిగిన ఎనిమిది చోట్ల అభ్యర్థిత్వాల కోసం గట్టి పోటీనడుస్తోంది. మధిర నుంచి సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఖమ్మం లేదంటే కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం, పాలేరు అభ్యర్థుల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉందని, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణలను దృష్టిలో పెట్టుకుని తమ అభ్యర్థులను ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నందున అక్కడ ఆయన పేరు ఖరారవడమే తరువాయి. ఒకవేళ పొంగులేటి ఖమ్మంలేదా పాలేరు నుంచి పోటీచేయాల్సి వస్తే కొత్తగూడెంలో కొత్తవారికి అవకాశం రానుంది. అక్కడ బీఆర్‌ఎస్ టికెట్ దక్కని పక్షంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరి టికెట్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. లేదంటే సీనియర్ నేత యడవల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు.
పినపాకలో ఇలా..!
పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా భద్రాద్రి జడ్పీచైర్మన్ కోరం కనకయ్య పేరు దాదాపు ఖరారే. అక్కడ కనకయ్యను వ్యతిరేకిస్తున్న వారు ఆశావహుల్లో ఉండగా.. డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ గుగులోత్ రవి, డాక్టర్ రామచంద్రనాయక్, కామేపల్లి జడ్పీటీసీ ప్రవీణ్‌నాయక్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు లక్ష్మణ్‌నాయక్, చీమల వెంకటేశ్వర్లు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ జడ్పీచైర్మన్‌గా ఉండి అధికార పార్టీని వదులుకొని వచ్చిన కనకయ్యకు అవకాశం తప్పకుండా ఉంటుందని సమాచారం. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, పొంగులేటితో పాటు పార్టీలో చేరిన జారే ఆదినారాయణ ప్రయత్నాల్లో ఉన్నారు. సత్తుపల్లిలో సంబాని చంద్రశేఖర్, డాక్టర్ మట్టా దయానంద్, రిటైర్డు ఇంజనీరింగ్ అధికారి కె.సుధాకర్, పీసీసీ రాష్ట్ర నాయకులు మానవతారాయ్ తదితరులు ఆశిస్తున్నారు. వైరాలోనూ పోటీ తీవ్రంగా ఉండగా.. ధరావత్ రామ్మూర్తినాయక్, బానోతు బాలాజీనాయక్, రాందాస్ నాయక్‌తో పాటు పొంగులేటితో కలిసి పార్టీలో చేరిన బానోతు విజయబాయి రేసులో ఉన్నారు.
సస్పెన్స్ కంటిన్యూ..!
ఖమ్మం విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. మంత్రి పువ్వాడకు దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. భట్టి విక్రమార్క అనుచరుడు మహ్మద్ జావీద్, మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ ఆదేశిస్తే కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి ఖమ్మం నుంచి బరిలో దిగే అవకాశమూ లేకపోలేదు.. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటిని కూడా ఖమ్మం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో రాయలనాగేశ్వరరావు టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి పాలేరునుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళతారని తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ టికెట్ రాయల నాగేశ్వరరావును వరించే అవకాశం ఉంది. ఆయనతో పాటు పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, ఇతర జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
వామపక్షాలతో పొత్తులుంటే..!
అయితే బీఆర్‌ఎస్ పొత్తు కుదిరితే కొత్తగూడెం, భద్రాచలం, వైరా నియోజకవర్గాలను వామపక్షపార్టీలు కోరుతున్నాయని, కానీ వైరా, భద్రాచలం వారికి కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి వామపక్ష పార్టీలు పాలేరు, కొత్తగూడెం సీట్లు అడుగుతున్నాయి. ఇక్కడ కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. అయితే బీఆర్‌ఎ్‌సతో పొత్తు వ్యవహారం ఎటూ తేలకపోతుండటంతో వామపక్షాలు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. తాము కోరుకుంటున్న సీట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగితే వామపక్షాలు బీఆర్‌ఎ్‌సతో పొత్తుకు రాంరాం పలికే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ పరిస్థితిని గ్రహించి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో హైవే భూనిర్వాసిత రైతుల పక్షాన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఘాటుగానే స్పందించారు. దీంతో బీఆర్‌ఎస్ వ్యవహార శైలి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఆశాపరులంతా కేసీఆర్ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.