Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?
ABN , First Publish Date - 2023-06-12T22:14:10+05:30 IST
అవును.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు (Telugu States Politics), టాలీవుడ్ సినీ పరిశ్రమ (Tollywood Industry) మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు బాగా ఏర్పడ్డాయ్.. తెలుగు సినీ రంగం నుంచి పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తమకు నచ్చిన పార్టీలో మెచ్చిన నేత సమక్షంలో నటులు కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇలా రోజురోజుకూ పాలిటిక్స్, సినిమా రంగాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడిపోయింది.
అవును.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు (Telugu States Politics), టాలీవుడ్ సినీ పరిశ్రమ (Tollywood Industry) మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు బాగా ఏర్పడ్డాయ్.. తెలుగు సినీ రంగం నుంచి పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తమకు నచ్చిన పార్టీలో మెచ్చిన నేత సమక్షంలో నటులు కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇలా రోజురోజుకూ పాలిటిక్స్, సినిమా రంగాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో కానీ బద్ధ శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాలను ఈ మధ్య నేతలు, నటీనటులు నిజం చేసి చూపిస్తున్నారు. ఇప్పుడీ విషయం ఎందుకు తెరపైకి వచ్చిందంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan kalyan) నటించిన ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా రిలీజ్ సమయంలో ప్రముఖ నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) (BVSN Prasad).. పవన్ మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు వచ్చాయి. దీంతో నిన్న, మొన్నటి వరకూ ప్రసాద్-పవన్ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అయితే.. సడన్‌గా సోమవారం నాడు జనసేన ఆఫీసులో బీవీఎస్‌ఎన్ ప్రత్యక్షమయ్యారు. దీంతో నాడు సినిమా పరంగా శత్రువులైనా.. ఇప్పుడు రాజకీయ పరంగా ఒక్కటయ్యారు.
పవన్ సమక్షంలో..!
జనసేన పార్టీ ఆఫీసులో కనిపించడమే కాదు.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) సమక్షంలో కండువా కప్పుకున్నారు. జనసేన కండువా కప్పిన పవన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే.. గతంలో ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించని బీవీఎస్ఎన్ ఉన్నట్టుండి జనసేన తీర్థం పుచ్చుకోవడం అటు ఏపీ పాలిటిక్స్‌లో.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారారు. ప్రసాద్ పార్టీలో చేరికపై జనసైనికులు, మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి బిగ్ షాట్ జనసేన తీర్థం పుచ్చుకోవడంతో పార్టీకి ఆర్థికంగా కలిసొస్తుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. కాగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను బీవీఎస్ అందించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్.. ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ ఎదుట వ్యక్తపరచగా.. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన పవన్.. జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్‌తో ప్రసాద్ చెప్పారు.
ఈసారైనా పోటీ చేస్తారా..?
ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు రాజకీయాలేమీ కొత్తకాదు..! గతంలో ప్రజారాజ్యం పార్టీకి కూడా ఈయన సేవలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పట్నుంచి విలీనం ముందు వరకూ ప్రజారాజ్యం పార్టీలోనే ప్రసాద్ ఉన్నారు. కాంగ్రెస్‌లో విలీనం తర్వాత యథావిధిగా సినీరంగంలో బిజీ అయ్యారు. అయితే ప్రజారాజ్యంలో చేరారు కానీ.. ఎందుకో పోటీచేయడానికి ప్రసాద్ సాహసించలేదు. అయితే.. ఈసారి కచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగడానికే పార్టీలో చేరారని జనసైనికులు చెప్పుకుంటున్నారు. నాడు అన్న పార్టీకి సేవలందించిన బీవీఎస్‌ఎన్.. ఇప్పుడు తమ్ముడు పార్టీలో చేరారు. ఈసారైనా కార్యకర్తగానే మిగిలిపోతారా..? లేకుంటే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీచేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.