Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..
ABN , First Publish Date - 2023-05-26T21:42:30+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది. అలాగనీ.. కుటుంబ సభ్యులు కూడా హత్యకు కారణం బయటి వ్యక్తులే అని చెప్పడం లేదు. ఇలా రోజుకో ట్విస్ట్.. గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. మరోవైపు సీబీఐ (CBI) దూకుడు పెంచి వీలైనంత త్వరగా ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. అయితే.. ఈ హత్యకేసులో అతి త్వరలో పెను సంచలనాలు తప్పేలా లేవు. శుక్రవారం నాడు ఊహించని రీతిలో విషయాన్ని సీబీఐ బహిర్గతం చేసింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా.. సీబీఐ తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పేరును ప్రస్తావించింది. అనుబంధ కౌంటరులో ఈ కీలక విషయాన్ని సీబీఐ ప్రస్తావించింది. వివేకా మృతి చెందినట్లు జగన్‌కు ఉదయం 6:15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొనడం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అఫిడవిట్ (CBI Affidavit) వ్యవహారం కలకలం రేపుతోంది.
ఇంతకీ అఫిడవిట్‌లో ఏముంది..!?
‘ వివేకా హత్యకేసు గురించి సీఎం వైఎస్ జగన్‌కు అవినాష్ రెడ్డే (YS Jagan-YS Avinash) చెప్పారా..? అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉంది. వివేక హత్య విషయం జగన్‌కు ఉదయం 6:15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలింది. ఎంవీ కృష్ణారెడ్డి (MV Krishna Reddy) ఉదయం 6:15 గంటలకు హత్య విషయం బయట పెట్టక ముందే జగన్‌కు తెలుసు. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ (Custodial Interrogation) చేయాల్సి ఉంది. విచారణకు ఎంపీ సహకరించడం లేదు. హత్య వెనక భారీ కుట్ర చెప్పేందుకు అవినాష్ ముందుకు రావడం లేదు. హత్య జరిగిన రాత్రి 12:27 గంటల నుంచి 1:10 వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారు. ఈనెల 15న విచారణకు రావాలని నోటీసులు ఇస్తే నాలుగు రోజులు సమయం కావాలన్నారు. మే- 16న మళ్లీ నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. 19న తల్లి అనారోగ్యం నెపంతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ (Hyderabad) విడిచి వెళ్లారు. విచారణకు రావాలని అవినాష్‌కు ఫోన్ చేసి కోరినప్పటికీ రాలేదు. ఈనెల 22న రావాలని నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఈనెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్ళింది. ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు భారీగా ఉండడంతో శాంతిభద్రల సమస్య రావచ్చునని అనిపించింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు’ అని హైకోర్టులో అడిషినల్ కౌంటర్ అఫిడవిట్‌ను సీబీఐ దాఖలు చేసింది. కాగా.. ఈ కేసులో జగన్ పేరు రావడం ఇదే తొలిసారి. ఈ ఒక్క వార్తతో వైసీపీలో వణుకు మొదలైంది. అసలేం జరుగుతుందో అని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఏం జరుగుతుందో..!?
విచారణకు రమ్మన్నప్పుడల్లా డుమ్మా కొడుతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఎంపీ ఒక్కసారి విచారణకు వస్తే అసలేం జరిగిందనేది తేలిపోనుందని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలు జగన్‌కు ఎవరు చెప్పారు..? అవినాషే చెప్పారా..? లేకుంటే మరెవరైనా చెప్పారా..? అనేది క్లియర్‌కట్‌గా తేలిపోనుంది. సీబీఐ చేసిన సంచలన ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లో ఇదిప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ విషయం తెలుసుకున్న మరుక్షణమే వైసీపీ అధిష్టానం ఏం చేద్దాం.. ? ఎలా ముందుకెళ్లాలి..? అని న్యాయ నిపుణులతో ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ ఆంధ్రాకు వచ్చాక ఆయన ఇచ్చే ఆదేశాలను బట్టి లీగల్ టీమ్ ముందుకెళ్లాలని భావిస్తోందట. మరోవైపు.. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ వెనుక భారీ కుట్ర కోణం ఉందని న్యాయవాదులు అనుమానిస్తున్నారట. మొత్తానికి చూస్తే.. అఫిడవిట్‌లో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడం పెను ప్రకంనలే రేపుతోంది. ఇంతవరకూ దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి జగన్ వచ్చాక ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో చూడాలి మరి. మొత్తానికి చూస్తే.. వివేకా హత్యకేసు కీలక మలుపులు తిరగబోతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.