KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్
ABN , First Publish Date - 2023-08-28T19:41:55+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో చిత్రవిచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (115 BRS Candidates) ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూసిన సంగతి తెలిసిందే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో చిత్రవిచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (115 BRS Candidates) ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సిట్టింగులు పక్క పార్టీవైపు చూస్తుండటంతో రివెంజ్ పాలిటిక్స్‌కు (Revenge Politics) దిగారు గులాబీ బాస్. ముఖ్యంగా ఖానాపూర్ (Khanapur) అసెంబ్లీ టికెట్ తనకు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే రేఖా నాయక్ (MLA Rekha Nayak) .. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అప్పటికే కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో.. మంత్రి హరీష్ రావుతో పలుమార్లు తన టికెట్ విషయమై రేఖా నాయక్ చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో వేరే మార్గం లేక ఖానాపూర్ టికెట్‌కు రేఖా నాయక్.. ఆసిఫాబాద్ టికెట్ కోసం ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ (Congress) నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయాలను ఎమ్మెల్యే మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఆ దరఖాస్తులకు తనకూ ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసిన తర్వాతే అధికారికంగా తాను బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతానని బహిరంగంగానే రేఖా నాయక్ ప్రకటించారు. ఇలా ప్రకటించిన గంటలోపే రేఖాకు కేసీఆర్ సర్కార్ (KCR Govt) ఝలక్ ఇచ్చింది. రేఖా నాయక్‌పై కేసీఆర్ రివెంజ్ తీర్చుకున్నారన్న మాట.
అసలేం జరిగింది..?
ఖానాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇవ్వకుండా.. మంత్రి కేటీఆర్ మిత్రుడు, ఎన్నారై అయిన జాన్సన్ నాయక్‌కు (Johnson Nayak) బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. బీఆర్ఎస్ వీడుతానని చెప్పిన గంటలోపే రేఖా నాయక్ అల్లుడిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రేఖా నాయక్ అల్లుడు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను (SP Sarath Chandra) బదిలీ చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకూ మహబూబాబాద్ జిల్లాకు శరత్ ఎస్పీగా ఉన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్పీ కూడా కంగుతిన్నారట. ఇంత సడన్‌గా చేయాల్సిన అవసరమేంటి..? ఎవరి మీదో కోపం ఉంటే.. తనపై చూపడమేంటి..? తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారట. అత్త మీద కోపం.... తీర్చుకున్నట్లు అదేదో సామెత ఉంది కదా.. కేసీఆర్ వ్యవహారం అలాగే ఉందన్న మాట.
ఎందుకీ కక్ష సాధింపు..?
అల్లుడిపై బదిలీ వేటుతో ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆమె వర్గీయులు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారు. ప్రభుత్వం.. తనపై, తన కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని రేఖానాయక్ ఆవేదన చెందుతున్నారు. ‘అత్త మీద కోపం అల్లుడిపై చూపిస్తున్నార’ని రేఖానాయక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన రేఖా.. లాబీయింగ్ చేయకపోవడం వల్లే తనకు టికెట్ దక్కలేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక గొడుగు కిందకు వెళ్లకతప్పదన్నారు. ఖానాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అసలు ఎస్టీనే కాదని.. పార్టీలో లాబీయింగ్ నడుస్తోందన్నారు. అసలు కన్వెర్డెడ్ క్రిస్టియన్ జాన్సన్‌కి ఎస్టీ కోటాలో సీటు ఎలా ఇస్తారని అధిష్టానాన్ని రేఖానాయక్ ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తానంటూ ఒకింత సవాల్ చేశారామె. తన సాయం లేకుండా ఖానాపూర్‌లో ఎవ్వరూ ముందుకెళ్లరన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే.. మంత్రి పదవి డిమాండ్ చేస్తాననే ఉద్దేశంతో టికెట్ ఇవ్వలేదని రేఖా నాయక్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే ఈ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి బరిలోకి దిగుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రేఖా నాయక్‌తో మొదలైన కేసీఆర్ రివెంజ్ పాలిటిక్స్ మున్ముందు ఇంకా ఎవరిపైన ఉంటాయో.. ఎక్కడ ఆగుతాయో వేచి చూడాల్సిందే మరి.