YCP MLA Anil Kumar Yadav: నిజంగానే అనిల్ వైసీపీని వీడతారా.. ఈ వార్తలు ఎందుకొచ్చాయంటే..
ABN , First Publish Date - 2023-06-23T17:20:47+05:30 IST
ఓ వైపు పెరుగుతున్న తిరుగుబాట్లు.. మరోవైపు ఎంత ప్రయత్నించినా తిరుగుబాటుదార్లపై పడని వేటు.. ఈ రెండూ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు సీఎం జగన్‌కు వీర విధేయుడిగా ఉన్న అనిల్ మాట ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
బల నిరూపణకు సై!
వైసీపీలో నగర ఎమ్మెల్యే అనిల్‌కు ఎదురుదెబ్బలు
పెరుగుతున్న తిరుగుబాట్లు
ఆయన ప్రమేయం లేకుండానే పదవులు
చేసిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు
అనిల్ ఒంటరి అవుతున్నారంటూ ప్రచారం
దాన్ని తిప్పికొట్టేలా నేడు కార్యకర్తలతో సమావేశం
ఓ వైపు పెరుగుతున్న తిరుగుబాట్లు.. మరోవైపు ఎంత ప్రయత్నించినా తిరుగుబాటుదార్లపై పడని వేటు.. ఈ రెండూ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు సీఎం జగన్‌కు వీర విధేయుడిగా ఉన్న అనిల్ మాట ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఎమ్మెల్యే సిటీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ ఒంటరి అవుతున్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా కార్యకర్తల్లో తన బలమేమిటో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు సిటీ వైసీపీలో తిరుగులేని నాయకుడిగా కొనసాగిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత బాబాయ్ రూప్‌కుమార్ యాదవ్ బద్ధ శత్రువుగా మారారు. అనిల్‌కు పోటీగా జగనన్న భవన్ పేరుతో మరో కార్యాలయం ప్రారంభించారు. ఇక నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా కొంత కాలంగా అనిల్‌కు దూరంగా ఉన్నారు. అనిల్‌ను మాటమాత్రం కూడా పిలవకుండా సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి సహకారంతో తనకు నుడా చైర్మన్ పదవి వచ్చిందే తప్ప అనిల్ చేసిందేమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు నగరంలో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు నగర నియోజకవర్గానికి చెందిన మంగళపూడి శ్రీకాంత్‌రెడ్డి వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనిల్ ప్రమేయం లేకుండా ఆయన్ను ఆ పదవికి నియమించారు. ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిల సిఫారసు మేరకే శ్రీకాంత్‌రెడ్డిని నియమించినట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పార్టీ పదవి ఇవ్వడాన్ని అనిల్ అవమానంగా భావించినట్లు చెబుతున్నారు.
మరోవైపు తిరుగుబాట్లకు ఆద్యుడైన రూప్‌కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనిల్ అధిష్ఠానాన్ని కోరినట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది సాధ్యపడకపోగా, పార్టీకి చెందిన నాయకుల బహిరంగ విమర్శలు, సిటీకి చెందిన వారికి జిల్లా పార్టీ పదవులు దక్కడంతో అనిల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరించడం ద్వారా అధిష్ఠానానికి, ప్రజలకు తన బలమేమిటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సిటీ వైసీపీ నాయకుల అధిపత్య పోరుతో రాజకీయం రసవత్తరంగా మారింది.