Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!
ABN , First Publish Date - 2023-02-25T22:22:05+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case) కేసు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. అతి త్వరలోనే ఈ కేసుకు ఎండ్ కార్డు పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ హత్య ఎవరు చేశారు..? ఎలా చేశారు..? ఎవరు చేయించారు..?
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case) కేసు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. అతి త్వరలోనే ఈ కేసుకు ఎండ్ కార్డు పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ హత్య ఎవరు చేశారు..? ఎలా చేశారు..? ఎవరు చేయించారు..? అనేదానిపై సీబీఐ అన్ని ఆధారాలూ సేకరించేసింది. జెట్ స్పీడ్‌తో విచారణ చేస్తున్న సీబీఐ (CBI) అతి త్వరలోనే కేసు వెనుక ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేసేసుకుంది. సరిగ్గా ఇదే టైమ్‌లో అధికార వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నానా యాగీ చేస్తున్నారు. కొందరైతే మరీ బరితెగించి మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అంత హోదాలో ఉన్న వ్యక్తి సిల్లీగా మాట్లాడటంతో సలహాదారు కాస్త జోకర్‌గా మారిపోయారేంటి..? అని సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంతకీ సజ్జలా అంతలా ఏం మాట్లాడారు..? ఆయన ఆరోపణల్లో నిజానిజాలెంత..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
అసలేం జరిగింది..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు (2019 మార్చి 14న అర్థరాత్రి) గడుస్తున్నాయ్. గత నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన కేసు ఇదే. హత్య జరగ్గానే ఈ కేసును తొలుత ఏపీ పోలీసులు విచారించగా ఆ తర్వాత సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అంతేకాదు.. కేసు విచారణ కడప జిల్లా కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకూ వెళ్లింది. ఈ కేసులో కొందరు నిందితులు అరెస్టు కాగా.. మరికొందరు సాక్షులు చనిపోయారు కూడా. ఇంకొందరు అఫ్రూవర్‌గా మారి.. హత్య రోజు అసలేం జరిగిందనే విషయాలు పూసగూచ్చినట్లుగా చెప్పేశారు. ఓ వైపు ఇలా జరుగుతుండగానే.. రెండుసార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని (MP YS Avinash Reddy) సీబీఐ విచారించింది. ఒకటోసారి 6 గంటలు.. రెండోసారి 5 గంటలపాటు అవినాష్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణ జరిగిన రెండ్రోజులు పెద్ద రచ్చే జరిగింది. త్వరలోనే ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy) కూడా సీబీఐ విచారణకు హాజరుకాబోతున్నారు. మరోవైపు.. ఈ కేసులో కీలక వ్యక్తులను అతి త్వరలోనే అరెస్ట్ (Arrest) చేయొచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సజ్జల సిల్లీ కామెంట్స్ ఇవీ..!
అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించడం వైసీపీని (YSR Congress) కుదిపేస్తోంది. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే చేయలేదని విచారణలో చెబుతారు.. నిజామా కాదా అన్నది సీబీఐ తేల్చుతుంది. విచారణ సక్రమంగానే జరుగుతోంది.. విచారణకు వెళ్తున్న వ్యక్తీ బాగున్నారు కానీ ఈ వ్యవహారంలోకి దూరిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. ఏదో జరిగిపోతోందన్నట్లుగా మీడియా ముందుకొచ్చి కామెంట్స్ చేశారు. పనిలో పనిగా చనిపోయిన వివేకా మీద లేనిపోని నిందలు సైతం మోపారు. ఆఖరికి ఆయనకు వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వివేకా కుటుంబ సభ్యుల్లో కలహాలు ఉన్నాయని.. ఆఖరికి ఆయన చెక్ వపర్‌నూ తీసేశారని సజ్జల చెప్పారు. రెండో భార్య (Viveka Second Wife) విషయంలోనూ విభేదాలున్నాయని.. హత్యకు రెండో పెళ్లి విషయం కారణమై ఉండవచ్చన్నారు. వివేకా చుట్టూ దశాబ్దాలుగా ఉన్నవారే ఆయనను హత్య చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వివేకాకు వ్యక్తిగత బలహీనతలున్నాయని కూడా ఆరోపించారు. అసలు ఈ విషయాన్ని సీబీఐ ఎందుకు పట్టించుకోవడంలేదని దర్యాప్తు సంస్థలనే సజ్జల ప్రశ్నించడం మొదలుపెట్టారు. ‘ఈ హత్యతో సంబంధం లేని అవినాశ్‌రెడ్డి వైపే వేలెత్తి చూపుతోంది. వైఎస్ జగన్ (YS Jagan) మెడకు ఈ అంశం చుట్టుకునేలా చేస్తోంది. విచారణ పేరిట సీబీఐ డ్రామా ఆడుతోంది. సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి అసలు దోషులెవరో తేల్చాలి. సీబీఐ విచారణలో కింది స్ధాయి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే సీబీఐ నడుచుకుంటోంది. సీబీఐ విచారణ తీరుపై సరైన సమయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం’ అని సజ్జల చాలా సిల్లీగా మాట్లాడారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా..?
సజ్జల కామెంట్స్ విన్న సొంత పార్టీ నేతలు బాబోయ్.. ఇంత సిల్లీగా మాట్లాడేస్తున్నారేంటి అని ముక్కున వేలేసుకున్నారట. అదేదో.. ఆడలేక మద్దెల దరువు.. అనే సామెత ఉంది కదా అలానే పరిస్థితి ఉందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతిపక్షాలను చూసినట్లుగా దర్యాప్తు సంస్థలను కూడా సజ్జల అనుమానించడం, రాజకీయాలకు అంటగడుతూ సంచలన ఆరోపణలు చేయడంతో కేసు వ్యవహారం ఆఖరికి దాకా వచ్చేసరికి ఇలా మాట్లాడేస్తున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అవినాష్ తప్పు చేయకపోతే.. అసలు దోషులెవరనే విషయం సీబీఐ తేలుస్తుంది అంతే కదా..? మధ్యలో దూరి సజ్జల సంకలు గుద్దుకోవడం ఏంటో అని వైసీపీలోనే కొందరు గుసగుసలాడుకుంటున్నారట.
చంద్రబాబుపైన (Chandrababu) ఆరోపణలు చేస్తున్నారు సరే.. సీబీఐని నిజంగా ప్రభావితం చేస్తున్నట్లు అయితే ఆయన అధికారంలో ఉండగానే ఇదంతా జరిగింది కదా.. అప్పుడే చేయాల్సింది చంద్రబాబు చేసేవారనే విషయం సజ్జలకు ఎందుకు అర్థం కావట్లేదో అని టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. పోనీ ఇవే కామెంట్స్ ఇప్పుడే కాకుండా ఇంతకుముందు ఎందుకు చేయలేదు..? హత్య కేసు పీకలదాకా వచ్చేసరికే ఇలా ఆరోపణలు చేస్తున్నారనే జనాలు లేకపోలేదు. ఇప్పటి వరకూ సీబీఐ చాలా మందిని విచారించింది.. అరెస్ట్ కూడా చేసింది.. కానీ అవినాష్ దాకా వచ్చేసరికి వైసీపీ ఎందుకిలా చేస్తోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలతో సోషల్ మీడియాలో (Socail Media) టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సలహాదారుగా ఉన్న వ్యక్తికి ఈ మాత్రం లాజిక్స్ తెలియకపోతే ఎలాగో మరి.