YSRCP: ఆరని పేచీలతో తలపట్టుకుంటున్న వైసీపీ అధిష్ఠానానికి మరో షాక్..!
ABN , First Publish Date - 2023-07-16T17:25:27+05:30 IST
కాకినాడ జిల్లా వైసీపీలో మరో ముసలం ముదిరింది. ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఆరని పేచీలతో తలపట్టుకుంటున్న అధిష్ఠానానికి తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి తోటనరసింహం పావులు కదుపుతుండడంతో పార్టీలో వర్గాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదేనంటూ తోట ఎక్కడి కక్కడ వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండడం నియోజక వర్గంలో కాకరేపుతోంది.
జగ్గంపేట వైసీపీలో ముసలం
మాజీ మంత్రి తోట నరసింహం వర్సస్ ఎమ్మెల్యే చంటిబాబు
వచ్చే ఎన్నికల్లో సీటు తనదేనంటూ తోట ఆత్మీయ సమావేశాలు
వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు: అధిష్ఠానం మొగ్గు తనవైపేనని ప్రచారం
జగ్గంపేటలో ఇకపై ఇంకో లెక్క అంటూ కొడుకు రాంజీ సవాళ్లు
కొందరు వైసీపీ నేతలు బ్రోకర్లు అంటూ ఓ సమావేశంలో వ్యాఖ్యలు
దీంతో తోట కుటుంబం తీరుపై ఎమ్మెల్యే చంటిబాబు వర్గం గుర్రు
రోడ్డెక్కి తోట నరసింహం తీరుపై జడ్పీటీసీలు, ఎంపీపీలు మండిపాటు
ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో పేచీలతో తలపట్టుకుంటున్న వైసీపీ
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లా వైసీపీలో మరో ముసలం ముదిరింది. ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఆరని పేచీలతో తలపట్టుకుంటున్న అధిష్ఠానానికి తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి తోటనరసింహం పావులు కదుపుతుండడంతో పార్టీలో వర్గాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదేనంటూ తోట ఎక్కడి కక్కడ వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండడం నియోజక వర్గంలో కాకరేపుతోంది. అటు ఎమ్మెల్యే చంటిబాబు వర్గానికీ చిర్రెత్తిస్తోంది. మరోపక్క నరసింహానికి మద్దతుగా ఆయన తనయుడు వరుస సవాళ్లు విసురుతుండడం మరింత కాక రాజేస్తోంది. కొందరు పార్టీనేతలను బ్రోకర్లు అని, ఇకపై తానొచ్చానని... లెక్క వేరేనంటూ ఇటీవల ఆయన పరుషంగా మాట్లాడిన వీడియోలు బయటకు రావడంతో ఎమ్మెల్యే వర్గం మరింత గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని టిక్కెట్ తనదే నంటూ తోట ప్రచారం చేసుకుంటుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఎమ్మెల్యే అనుచరులు శనివారం తోటను దులిపేయడంతో జగ్గంపేట వైసీపీలో విభేదాలు రోడ్డెక్కినట్లయింది.
ఆత్మీయ సమావేశాలతో కాక..
తమ పార్టీకి కంచుకోటగా భావించే జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పుడు ముసలం రాజుకోవడంతో వైసీపీ తలపట్టుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గంలో స్పీడు పెంచడం విభేదాలను రాజేస్తోంది. వచ్చేఎన్నికల్లో తాను ఇక్కడినుంచే పోటీ చేస్తానని, టిక్కెట్ తనదేనని, అధినేత జగన్ ఆశీస్సులు పుష్కలంగా తనకే ఉన్నాయంటూ తోట నరసింహం పదే పదే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. మండలాల్లో ప్రచారం ఆత్మీయ సమావేశాల పేరుతో క్యాడర్‌ను కలుస్తున్నారు. సీటు తనదేనని, తన కోసం పనిచేయాలని కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే చంటిబాబు వర్గం ఆగ్రహంగా ఉంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నరసింహం చేస్తున్న రాజకీయంతో నియోజకవర్గంలో గ్రూపులు పెరుగుతున్నాయని కారాలు మిరియాలు నూరుతోంది. అయినా తోట ఇదేదీ పట్టించుకోవడంలేదు. అటు ఎమ్మెల్యే వర్గం తోట తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నా ఎక్కడా రోడ్డెక్కలేదు. ఇటీవల నరసింహం తనయుడు రాంజీ వరుసగా గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లోని ఆత్మీయ సమావేశాల్లో చేసిన పరుష వ్యాఖ్యలు ఎమ్మెల్యే వర్గానికి చిర్రెత్తించాయి. పార్టీలో కొందరు బ్రోకర్లున్నారని, వారు అసలు నేతలు కాదని రాంజీ వ్యాఖ్యానించారు.
తోట నరసింహం వచ్చాక తిరిగి తమ దగ్గరకు వచ్చేందుకు కొందరు నేతలు వెనుకాడరని, ఇకపై అలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు. ఇకపై తానొచ్చానని, లెక్కలు వేరుగా ఉంటాయన్నారు. ఇప్పటికే నరసింహం తీరుపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే చంటిబాబు వర్గానికి రాంజీ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఎమ్మెల్యే వెనుక తిరిగే వారిని బ్రోకర్లుగా సంబోధించడం ఏంటంటూ చంటిబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో నరసింహం తీరుపై శనివారం జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు సహా పలువురు రోడ్డెక్కారు. తోటనరసింహం తీరుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చంటిబాబు ఉండగా ఏ హోదాలో నియోజకవర్గంలో ఆయన తిరుగుతారని నిప్పులు కక్కారు. నాలుగేళ్లుగా ఎక్కడున్నారని ప్రశ్నించారు ఇంతకాలం నరసింహం ఆత్మీయ సమావేశాలను పట్టించుకోని ఎమ్మెల్యే వర్గం ఇకపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే గత ఆదివారం కాకినాడకు వచ్చిన పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్‌రెడ్డికి నరసింహం తీరును ఎమ్మెల్యే వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా ఖాతరు చేయకుండా టిక్కెట్ తనదేనని ప్రచారం చేస్తూ పార్టీలో విభేదాలు పెంచుతున్నారని చెప్పారు.
ఎవరి ధీమా వారిది..
2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి తోట నరసింహం రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు అధిష్టించారు. ఆ తర్వాత 2014లో జగ్గంపేట నుంచి వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల చంటిబాబుకు సీటు లభించడంతో నరసింహం జగ్గం పేటను వదులు కోవాల్సి వచ్చింది. దీంతో టీడీపీలో చేరి కాకినాడ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి నరసింహం వైసీపీలో చేరారు. జగ్గంపేట వైసీపీ సీటు చంటిబాబుకు రావడం, ఆపై అనారోగ్యం బారిన పడడంతో నర సింహం తన భార్యకు పెద్దాపురం వైసీపీ సీటు తెచ్చుకున్నారు. తీరా ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో నరసింహం తనకు అచ్చొచ్చిన జగ్గంపేటనుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే చంటిబాబును కాదని నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడం ఇప్పుడు ముసలం రాజేస్తోంది. ఒకపక్క పార్టీ అధిష్ఠానం నరసింహం లేదా ఆయన భార్యను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ స్థానబలం లేకపోవడంతో నరసింహం జగ్గంపేటపై దృష్టిసారించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ విభేదాలు మున్ముందు ఏస్థాయికి చేరుతాయోననే ఆందోళన పార్టీ వర్గాలను వేధిస్తోంది.
‘ఆత్మీయ సమ్మేళనాల పేరిట వైసీపీ శ్రేణులను విభజిస్తున్న తోటనరసింహం’
మాజీ మంత్రి తోట నరసింహం నియోజక వర్గంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సభలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులను, కార్యకర్తలను విభజించే ధోరణిలో ఉన్నారని, ఇది మంచిది కాదని జగ్గంపేట ఏఎంసీ చైర్మన్ జనపరెడ్డిబాబు అన్నారు. జగ్గంపేటలో శనివారం ఆయన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నేతృత్వంలో పనిచేస్తున్నామన్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీ క్యాడర్‌ను విచ్ఛినం చేసే దిశలో తోట నరసింహం సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. పార్టీ నాయకులను బ్రోకర్లు అంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల నరసిం హం ఆయా మండలాల్లోని ఎమ్మెల్యే చంటిబాబు తరపు మనుషులను విమర్శించే పనిలో ఉన్నారన్నారు. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని, తాను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పుకో వడం సరికాదన్నారు. మీరు జగ్గంపేటలో ఎమ్మెల్యే, మంతిగ్రా పనిచేసి నా దశాబ్ధకాలంపాటు ఎంపీపీ, జడ్పీటీసీల ను గెలిపించుకోలేకపోయా రన్నారు. చంటిబాబు హయాంలో నాలుగు మండలాల్లో వైసీపీ జెండా ఎగురవేసిందన్నారు. జగ్గంపేట, కిర్లంపూడి ఎంపీపీలు అత్తులూరి నాగబాబు, తోట రవి, గండేపల్లి, కిర్లంపూడి జడ్పీటీసీలు పాల్గొన్నారు.