Apple Watch: యాపిల్ వాచా మజాకా.. ఘోర రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలో డ్రైవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

ABN , First Publish Date - 2023-09-04T17:54:31+05:30 IST

యాపిల్ వాచ్ చెప్పుకోవడానికి చాలా ఖరీదైంది కానీ.. ఇందులోని హెల్త్ ఫీచర్స్ మాత్రం అద్భుతంగా పని చేస్తాయి. అనారోగ్యానికి గురైనప్పుడు అలర్ట్ ఇవ్వడమో.. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు స్వయంగా...

Apple Watch: యాపిల్ వాచా మజాకా.. ఘోర రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలో డ్రైవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

యాపిల్ వాచ్ చెప్పుకోవడానికి చాలా ఖరీదైంది కానీ.. ఇందులోని హెల్త్ ఫీచర్స్ మాత్రం అద్భుతంగా పని చేస్తాయి. అనారోగ్యానికి గురైనప్పుడు అలర్ట్ ఇవ్వడమో.. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం వంటి పనులు చేస్తాయి. ఈ ఫీచర్స్‌తో ఈ యాపిల్ వాచ్ ఇప్పటికే ఎంతోమందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలు రక్షించి.. మరోసారి తన లైఫ్-సేవింగ్ సామర్థ్యాన్ని చాటింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


అమెరికాలోని విస్కాన్సిస్‌లో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక కారు పల్టీలు కొడుతూ.. రహదారి నుంచి 100 అడుగుల దూరంలో తలక్రిందులుగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు పోలేదు గానీ, అతడు అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. అప్పుడే అతని చేతికున్న యాపిల్ వాచ్ ‘లైఫ్ సేవర్’గా మారింది. ఇందులోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ వెంటనే స్పందించడంతో.. ఆటోమెటిక్‌గా 911 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ వెళ్లింది. అంతేకాదు.. ఈ ఫీచర్ ఖచ్చితమైన లొకేషన్‌ని కూడా అత్యవసర సిబ్బందికి పంపించింది. దీంతో.. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో బాధితుడ్ని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. యాపిల్ వాచ్ పుణ్యమా అని అతడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. లేకపోతే.. పరిస్థితులు మరోలా ఉండేవి.

ఈ ఘటనపై కాన్సాస్‌విల్లే ఫైర్ & రెస్క్యూ డిపార్ట్‌మెంట్ చీఫ్ రొనాల్డ్ మోల్నార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో యాపిల్ వాచ్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఒకవేళ యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. చిమ్మచీకటి కారణంగా బాధితుడి కారుని గుర్తించడానికి కనీసం రెండు గంటల సమయం పట్టేదని అన్నారు. కాగా.. కారు ప్రమాదానికి గురైనప్పుడు, యాపిల్ వాచ్‌లోని ఎమర్జెన్సీ SOS యాక్టివేట్ అవుతుంది. అప్పుడు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ వెంటనే స్పందించి, ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ కాల్‌తో పాటు లైవ్ లొకేషన్ అత్యవసర విభాగానికి వెళ్లేలా చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల యాపిల్ వాచ్ ఎంతోమందిని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి.

Updated Date - 2023-09-04T17:54:31+05:30 IST