Woman: 24 గంటల పాటు టైమ్ ఇస్తున్నాం.. ఆలోచించుకుని నిర్ణయం చెప్పండంటూ ఆ మహిళకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం వెనుక..!
ABN , First Publish Date - 2023-10-13T12:38:37+05:30 IST
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తనకు సంబంధించిన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. కానీ అవి చట్టబద్దమైనవై ఉండాలి. లేకపోతే పోలీసులు, కోర్టులు,
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తనకు సంబంధించిన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. కానీ అవి చట్టబద్దమైనవై ఉండాలి. లేకపోతే పోలీసులు, కోర్టులు, చట్టాల ద్వారా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కొందరు చట్ట విరుద్దమైన కోర్కెలు నెరవేర్చుకునే ఆలోచనతో కోర్టులను ఆశ్రయిస్తుంటారు. తమ వైపు కారణాలు చెబుతూ వాదనలు వినిపిస్తారు. కోర్టు ఆ విషయం గురించి అన్ని కోణాలలో విచారణ చేసి మరీ వారికి అనుమతి ఇవ్వాలా వద్దా అని తేల్చుతుంది. 26 వారాల గర్భవతి తనకు అబార్షన్ కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తే చాలా పెద్ద తతంగమే నడిచింది. ఈ సంఘటనలో మహిళ చెప్పిన కారణం, కోర్టు చెప్పిన తీర్పు పూర్తీగా తెలుసుకుంటే..
పిల్లలను కనడం, కనకపోవడంలో మహిళలకు హక్కులున్నాయి. కానీ గర్భం ధరించిన మహిళల నిర్ణయాలు చట్టాలలో పేర్కొన్న రూల్స్ కు అనుగుణంగా ఉండాలి. బలవంతంగా గర్భం దాల్చిన మహిళలు, పెళ్ళి కాని యువతులు, లివ్- ఇన్ రిలేషన్లో ఉన్నవారికి గర్భం తొలగించవచ్చని చట్టంలో రూల్స్ ఉన్నాయి. కానీ 26 వారాల గర్భాన్ని మోస్తున్న ఓ 27ఏళ్ళ మహిళ తనకు అబార్షన్ కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరికి నాలుగేళ్లు కాగా మరొకరిని 2022, సెప్టెంబర్ నెలలో ప్రసవించింది. ఆమె తన రెండవ బిడ్డకు పాలు ఇస్తున్న నేపథ్యంలో లాక్టేషనల్ అమెనోరియా అనే గర్భనిరోధక పద్దతిని ఉపయోగించింది. అయితే ఆమె ప్రయత్నం విఫలమైంది. ఈ కారణంగా ఆమె బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలలకే మళ్లీ గర్భం దాల్చింది. లాక్టేషనల్ అమెనోరియా కారణంగా ఆమెకు నెలసరి కూడా రాలేదు. దీంతో తను గర్భం దాల్చిన విషయం చాలా ఆలస్యంగా బయటపడింది. ప్రస్తుతం ఆమె కడుపులో పెరుగుతున్న పిండం వయసు 26 వారాలు. ఆమె గర్బనిరోధక పద్దతి ఫాలో అవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడం లేదని, బిడ్డ ప్రాణాలతో పుట్టే అవకాశాలు కూడా లేవని ఈ కారణంగా తనకు అబార్షన్ కోసం అనుమతి కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆమె సమస్యకు సానుకూలంగా స్పందించింది. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు అబార్షన్ నిర్వహించాలని ఈ నెల 9వ తేదీన తీర్పు ఇచ్చింది.
Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..
తమ దగ్గరకు వచ్చిన మహిళకు స్కానింగ్ చేసిన ఎయిమ్స్ వైద్యులు షాకయ్యారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపద్యంలో కోర్టుకు విషయాన్ని తెలిపారు. కోర్టు తరపున ఇద్దరు న్యాయమూర్తులు ఈ విషయం గురించి విచారణ చేపట్టారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అబార్షన్ కు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పుకొచ్చారు. మహిళ తరపున లాయర్ ప్రసవానంతరం ఆ మహిళ మానసిక డిప్రెషన్ అనుభవిస్తోందని, పైగా ఆమె పేద కుటుంబానికి చెందినదని, ఇంకో రెండు వారాలు గడిస్తే కడుపులో బిడ్డ మరణించడం జరుగుతుందని వాదన వినిపించారు. ఆ వాదనలను అన్నింటిని కోర్టు తోసి పుచ్చింది. 'తను బిడ్డను కనాలా, వద్దా అనే విషయం ఆలోచించడానికి ఆమెకు 26 వారాల సమయం అవసరమైందా?' అని ఎద్దేవా చేశారు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టే వీలున్నప్పుడు అబార్షన్ కు అనుమతి ఇస్తే అది భ్రూణహత్య అవుతుందని చెప్పారు. బిడ్డను పెంచడానికి ఆర్థిక పరిస్థితి లేకపోతే బిడ్డను దత్తత ఇవ్వడానికి సిద్దమేనా అని ప్రశ్నించారు. కానీ ఆ మహిళ మాత్రం తనకు బిడ్డను కనడం ఇష్టం లేదని పేర్కొంది. దీంతో కోర్టు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆమెకు 24 గంటల సమయాన్ని కేటాయించింది.