YCP Conspiracy Exposed: మరీ ఇంతకు దిగజారాలా..? ఏబీఎన్‌పై వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్ర బట్టబయలు
ABN , First Publish Date - 2023-02-22T14:15:51+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (YCP) ఓటమి భయం పట్టుకుందా..? తాము ప్రత్యర్థులుగా భావించే వారిపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారమే లక్ష్యంగా పేటీఎం బ్యాచ్‌ను..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (YCP) ఓటమి భయం పట్టుకుందా..? తాము ప్రత్యర్థులుగా భావించే వారిపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారమే లక్ష్యంగా పేటీఎం బ్యాచ్‌ను (Paytm Batch) ఉసిగొల్పుతోందా..? అందుకు వారికి నచ్చని మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందా..? ఇంతకు మించి దిగజారకపోవచ్చని ఆశించిన ప్రతిసారీ దిగజారడంలో ‘తమకు లేరవరు సాటి.. తమకు తామే పోటీ’ అని వైసీపీ సోషల్ మీడియా విభాగం నిరూపించుకుంటోందా..? ‘ఆంధ్రజ్యోతి’ని (AndhraJyothy) అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు సంకేతం..? జగన్‌కు (Jagan) నచ్చకపోతే మీడియా సంస్థలను కూడా తమ విష ప్రచారాలకు బలి చేసేంత నీచ స్థాయికి వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media Batch) దిగజారడం ఆ పార్టీ వికృత రాజకీయాలకు అద్దం పడుతోందా..? దమ్మున్న ఛానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిని (ABN AndhraJyothy) దిగజార్చేందుకు, అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న తాజా దుష్ప్రచారంపై ప్రత్యేక కథనం.
తెలుగు వార్తా పత్రికలు, ఛానళ్లనీ తమకు కరపత్రాలుగా, బాకా ఊదే ప్రచార సాధనాలుగా ఉండాలని వైసీపీ అనునిత్యం కాంక్షిస్తుంటుంది. సొంత మీడియాలో, సోషల్ మీడియాలో జగన్ భజన చేస్తూ తన్మయత్వంలో మునిగితేలుతుంటుంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే నిష్పాక్షిక మీడియా అంటే వైసీపీకి అస్సలు నచ్చదు. అందుకు ఆ మీడియా సంస్థలపై బురద చల్లేందుకు ఏమాత్రం వెనుకాడరు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగనే బహిరంగ సభల సాక్షిగా తమకు నచ్చని మీడియాపై ‘ఎల్లో మీడియా’ అని ముద్ర వేసి ప్రజల్లో సానుభూతి కోసం పరితపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థపై, ఏబీఎన్‌పై జగన్ అసహనం వెళ్లగక్కిన సందర్భాలు కూడా తెలుగు ప్రజలు గమనించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ విషయంలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
వైసీపీ ప్రభుత్వ లోపాలను నిష్పాక్షికంగా ఎత్తిచూపుతున్న ఏబీఎన్‌ను టార్గెట్ చేసింది. ఇందు కోసం ఒక కుటిల కుట్రకు తెరలేపింది. వైసీపీ సోషల్ మీడియా ఎంతకు బరితెగించిందంటే.. ఆంధ్రజ్యోతిని, ఏబీఎన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు నీచానికి దిగజారింది. ఏబీఎన్‌లో ప్రసారం కాని, ఆంధ్రజ్యోతికి గానీ, ఏబీఎన్‌కు గానీ ఎలాంటి సంబంధం లేని ఒక ఫేక్ వార్తను ఏబీఎన్‌లో ప్రసారమైన వీడియోగా చిత్రీకరించేంత చిల్లర ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా వాడుకుంది. ఏబీఎన్‌లో ప్రసారమైనట్టుగా ఒక వీడియోకు ‘పవన్ మళ్లీ విడాకులు’? అని థంబ్‌నెయిల్ టైటిల్ ఇచ్చి.. ఏబీఎన్ లోగోను వాడి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి వైసీపీ పేటీఎం బ్యాచ్ దిగజారింది. ఏబీఎన్ ఫేస్‌బుక్ పేజ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసినట్టుగా ఫేక్ ప్రచారం చేసి, ఆ ఫేక్ థంబ్‌నెయిల్ ఫొటోను సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ జోరుగా ప్రచారం చేసింది. ఈ ప్రచారం చేసిన పేటీఎం బ్యాచ్‌కు ఎన్నిసార్లు 5 రూపాయలు క్రెడిట్ అయ్యాయో తెలియదు గానీ.. తమ నీచ రాజకీయాలు ఇలానే ఉంటాయని వైసీపీ సోషల్ మీడియా సాక్షిగా ఈ చర్యతో మరోసారి నిరూపించుకుంది.
వైసీపీ అధిష్టానానికి నచ్చని మీడియాపై, ప్రజల మనసు గెలుచుకున్న ఏబీఎన్‌పై ప్రజల్లో దురభిప్రాయం కలిగించేందుకు పేటీఎం బ్యాచ్ బాగానే కష్టపడింది. నిజమైన థంబ్‌నెయిల్‌ను తలపించేలా ఫేక్ థంబ్‌నెయిల్‌ను సృష్టించి ఏబీఎన్‌ను ద్వేషించేలా చేయాలని ఎత్తుగడ వేసి సోషల్ మీడియా సాక్షిగా ఆపసోపాలు పడింది. కానీ.. ఈ ఫేక్ ప్రచారాన్ని ఏబీఎన్ తిప్పికొట్టింది. ఇలాంటి నీచానికి దిగజారిన వైసీపీ సోషల్ మీడియా విభాగంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. నిష్పాక్షికంగా ఉండాల్సిన మీడియా తమ అడుగులకు మడుగులొత్తాలనే విపరీత ఆలోచనలను మార్చుకోకపోగా, మీడియాపై ఇలాంటి కుట్రలకు తెరలేపే స్థాయికి వైసీపీ వెళ్లిందంటే ఆ పార్టీ అధినేత జగన్‌కు ఈ పరిణామం సిగ్గుచేటని చెప్పక తప్పదు.
సత్య దూరంగా వార్తలు ఇచ్చుకుని, ఆ వార్తలను వైరల్ చేసి సొమ్ము చేసుకోవాల్సిన ఖర్మ ఆంధ్రజ్యోతికి గానీ, ఏబీఎన్‌కు గానీ ఏనాడు పట్టలేదు, పట్టదు కూడా. నిష్పాక్షిక జర్నలిజమే ఊపిరిగా, అక్షరమే ఆయుధంగా ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక, దమ్మున్న ఛానల్‌గా ‘ఏబీఎన్’ ప్రజల ఆదరాభిమానాలతో ఏళ్ల నుంచీ ముందుకెళుతున్నాయని గర్వంగా చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించం. వైసీపీ సోషల్ మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరేంటో విజ్ఞులైన ప్రజలకు తెలుసు. పాత్రికేయ ప్రమాణాలకు తిలోదకాలు వదిలిన నీలి మీడియాకు, పేటీఎం బ్యాచ్‌కు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎన్నటికీ బెదరవు. ఇకనైనా ఇలాంటి నీచ, దిగజారుడు ప్రచారాలు, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, తిట్ల దండకాలు మాని రాజకీయంగా ఎదుర్కొనే దిశగా వైసీపీ అడుగులేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.