Rahane: రహానె 2.0.. కీలక మ్యాచ్‌లో ముద్రవేశాడు..
ABN , First Publish Date - 2023-06-10T01:49:14+05:30 IST
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారీ ఆశలు పెట్టుకొన్న భారత టాప్-4 స్టార్లు రోహిత్, కోహ్లీ, పుజార, గిల్ ఘోరంగా విఫలమవడంతో అభిమానుల్లో నైరాశ్యం. కానీ చెరగని ముద్రవేశాడు
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారీ ఆశలు పెట్టుకొన్న భారత టాప్-4 స్టార్లు రోహిత్, కోహ్లీ, పుజార, గిల్ ఘోరంగా విఫలమవడంతో అభిమానుల్లో నైరాశ్యం. అయితే, టీమిండియా ఇంకా మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదంటే.. అందుకు అజింక్యా రహానెనే కారణం. ఆసీస్ పేస్ దెబ్బకు భారత బ్యాటింగ్ పేకమేడలా వణికినా.. రహానె 89 పరుగులతో ఆపద్బాంధవుడిగా నిలిచాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానె విలువైన ఇన్నింగ్స్ కారణంగానే.. ఫాలో ఆన్ గండాన్ని భారత్ తప్పించుకోగలిగింది. క్రీజులో ఉన్నంతసేపు స్థిరచిత్తం, చక్కని టెక్నిక్‌తో బౌలర్లను ఎదుర్కొన్న తీరు మిగతా బ్యాటర్లకు మార్గదర్శనం చూపేలా ఉంది.
తన బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్నపాటి మార్పులతో కీలక మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ముద్రవేశాడు. గతంలో బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్‌ను కింద ఆనించకుండా.. పైకెత్తి పట్టుకొనేవాడు. ఇప్పుడు మాత్రం బౌలర్ బంతిని రిలీజ్ చేసే ముందు ఆ పొజిషన్‌లోకి వచ్చి ఆడుతున్నాడు. అతడి స్టాన్స్, చేతులు, తల ఎంతో స్థిరంగా ఉండడంతో.. షాట్‌ను తను అనుకొన్న దిశగా కొడుతున్నాడు. డిఫెన్స్ మెరుగుపడగా.. ఆఫ్ సైడ్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. గతేడాది దక్షిణాఫ్రికా టూర్‌లో వైఫల్యంతో టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన రహానె.. దేశవాళీ టోర్నీలతోపాటు ఐపీఎల్‌లో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొన్నాడు. గాయంతో శ్రేయాస్ దూరమవడంతో రహానెకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే చాన్స్ దక్కింది. ఐపీఎల్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ఔరా అనిపించిన రహానె.. ఈ మ్యాచ్‌లో తన రెండో వెర్షన్‌తో టీమిండియాను ఆదుకొన్నాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)