All Time Record: చరిత్ర సృష్టించిన డిస్నీ హాట్‌స్టార్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డు బద్దలు
ABN , First Publish Date - 2023-10-23T16:49:39+05:30 IST
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు ధాటింది. క్రమంగా ఈ సంఖ్య 4.3 కోట్లకు చేరింది.
సినిమాల్లోనే కాకుండా క్రికెట్ మ్యాచ్‌లలో కూడా రికార్డులు బద్దలు అవుతున్నాయి. చాన్నాళ్లు పోటీ లేకపోవడంతో స్టార్ గ్రూప్ మాత్రమే క్రికెట్ ప్రసారాల్లో అగ్రగ్రామిగా నిలిచేది. అయితే జియో రంగంలోకి దిగడంతో లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ లాంటి మెగా టోర్నీని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడంతో అభిమానులు జియో సినిమా యాప్‌ను విపరీతంగా ఆదరించారు. రెండున్నర కోట్లకు పైగా వీక్షకులు ఐపీఎల్‌ను చూసి కేరింతలు కొట్టారు. దీంతో ఇప్పుడు హాట్ స్టార్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని సబ్‌స్క్రిప్షన్‌తో పని లేకుండా ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ టోర్నీలోనే ఎంతో ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 3.2 కోట్ల మంది ఒకేసారి వీక్షించగా ఇప్పటివరకు ఇదే రికార్డుగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Team India: బ్రేకింగ్ న్యూస్.. టీమిండియా లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
అయితే తాజాగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఆదివారం.. అందులోనూ ఫెస్టివల్ హాలీడేస్.. అంతేకాకుండా గత 20 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై టీమిండియాకు విజయం లేకపోవడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి చూపించారు. దీంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా 4.3 కోట్ల మంది ఒకేసారి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను వీక్షించి రికార్డుకు నాంది పలికారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు ధాటింది. క్రమంగా ఈ సంఖ్య 4.3 కోట్లకు చేరింది. విరాట్ సెంచరీ చేసి ఉంటే ఈ సంఖ్య మరింత పెరిగి ఉండేదని హాట్ స్టార్ అభిప్రాయపడింది. క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడల్లో కూడా ఓ మ్యాచ్‌కు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇన్ని రియల్ టైమ్ వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని సమాచారం.