Share News

World Cup: ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్లున్నారు.. పాక్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-24T16:45:51+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో విఫలమవుతున్న ఆ జట్టు ఫేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీ మొదట్లో బాగానే ఆడిన ఆ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేసింది.

World Cup: ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్లున్నారు.. పాక్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ ఆగ్రహం

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో విఫలమవుతున్న ఆ జట్టు ఫేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీ మొదట్లో బాగానే ఆడిన ఆ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిన పాక్ జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముఖ్యంగా సోమవారం పసికూన అప్ఘానిస్థాన్‌ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాకిస్థాన్ ఓడిపోవడం కన్నా.. ఓడిన విధానమే ఆ జట్టు అభిమానులను బాధపెడుతోంది. అప్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా తమ ఫేలవ ఫీల్డింగ్‌తో అప్ఘాన్ బ్యాటర్లకు అదనపు పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్ఘానిస్థాన్ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించింది. దీంతో పాకిస్థాన్ జట్టు ఆట తీరుపై అభిమానులు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా తమ ఆటగాళ్లపై ఫిట్‌నెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ కూడా పాకిస్థాన్‌ ఆట తీరుపై, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లంతా ప్రతి రోజూ 8 కిలోల చొప్పున మటన్ తింటున్నట్లుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆట తీరుపై ఆయన మాట్లాడాడు.


"ఇది ఇబ్బందికరంగా ఉంది. కేవలం 2 వికెట్లు, 280-290 ఒక పెద్ద స్కోరు. పిచ్‌పై తడి ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తుంటే వారి ఫిట్‌నెస్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది. పాక్ ఆటగాళ్లకు గత రెండేళ్లుగా ఫిట్‌నెస్ పరీక్షలు జరగలేదని మేము ఈ షోలో చర్చించుకున్నాం. నేను ఆటగాళ్ల పేర్లు చెబితే వారికి నచ్చదు. కానీ వాళ్లు ప్రతి రోజూ 8 కిలోల చొప్పున మటన్ తింటున్నట్టుగా కనిపిస్తోంది.’’ అని వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడని ఆయన గుర్తు చేశాడు. ఇది ఆటగాళ్లకు నచ్చకపోయినా జట్టు మాత్రం అద్భుతాలు చేసిందని చెప్పుకొచ్చాడు. ‘‘ఫిట్‌నెస్ పరీక్షలు కచ్చితంగా ఉండాలి. వృత్తి పరంగా మీరు దేశం కోసం ఆడుతున్నారు. అందుకు మీకు జీతం కూడా ఇస్తున్నారు. నేను మిస్బాతో కలిసి పని చేశాను. అతను కోచ్‌గా ఉన్నప్పుడు అతని ప్రమాణాలు బాగుండేవి. కానీ ఆటగాళ్లు అతన్ని అస్యహించుకున్నారు. అయినప్పటికీ అది జట్టుకు మంచి చేసింది. ఇప్పుడు మనం ఏ దశకు చేరుకున్నామంటే విజయం కోసం దేవుడిని ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండు. ఇది జరిగితే బాగుండు. మరో జట్టు ఓడిపోతే సెమీస్‌కు చేరుకోవచ్చని మాట్లాడుకుంటున్నాం. ఫీల్డింగ్ అంటే ఫిట్‌నెస్‌తో ముడిపడింది. మైదానంలో ఇది స్పష్టంగా తెలుస్తోంది.’’ అని వసీం అక్రమ్ అన్నాడు.

కాగా సోమవారం నాడు చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ ఈ స్కోరు ఛేదించలేదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆప్ఘనిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87) హాఫ్ సెంచరీలతో మంచి పునాది వేశారు. గుర్భాజ్ అవుటైనా రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్) తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Updated Date - 2023-10-24T16:50:09+05:30 IST