Cameron Green: భారత్‌తో మూడో టెస్టుకు నేను రెడీ!

ABN , First Publish Date - 2023-02-24T19:44:51+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మార్చి 1న ఇండోర్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు

Cameron Green: భారత్‌తో మూడో టెస్టుకు నేను రెడీ!

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మార్చి 1న ఇండోర్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు తాను అందుబాటులో ఉన్నట్టు ఆసీస్ ఆల్‌రౌండర్ కేమరాన్ గ్రీన్(Cameron Green) ప్రకటించాడు. గతేడాది డిసెంబరులో దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోపోవడంతో భారత్‌లో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.

నాగ్‌పూర్ టెస్టు(Nagpur Test)కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న అనుమానంతోనే గ్రీన్ జట్టుతో కలిసి భారత్‌లో అడుగుపెట్టాడు. అయితే, అతడు కోలుకునేందుకు మరింత సమయం ఇస్తూ తొలి రెండు టెస్టులకు దూరం పెట్టింది. గ్రీన్ వేలికి శాస్త్ర చికిత్స జరగడంతో కోలుకునేందుకు మరింత సమయం అవసరమైంది. రెండో టెస్టు ఆడేందుకు తాను దాదాపు సిద్ధమయ్యానని, అయితే మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల మిగతా రెండు టెస్టులు ఆడేందుకు వంద శాతం సిద్ధమైనట్టు చెప్పాడు. కాగా, గ్రీన్ 18 టెస్టుల్లో 23 వికెట్లు తీసుకుని 806 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లోను భారత జట్టు ఘన విజయాలు సాధించి సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. ఇండోర్ టెస్టులో భారత్ కనుక విజయం సాధిస్తే సిరీస్ సొంతమవుతుంది. కాగా, మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం బారినపడడంతో స్వదేశం వెళ్లిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టు ప్రారంభ సమయానికి వచ్చేస్తాడని భావించారు. అయితే, అతడు ఇండోర్ టెస్టుకు అతడు అందుబాటులో ఉండడం లేదని జట్టు ప్రకటించింది. దీంతో మూడో టెస్టులో ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-02-24T19:44:53+05:30 IST