Share News

IND Vs AUS T20 Series: టీమిండియాకు మళ్లీ కొత్త కెప్టెన్..!! త్వరలో ప్రకటన

ABN , First Publish Date - 2023-11-17T20:05:54+05:30 IST

Team India: మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడటంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యకుమార్ యాదవ్‌ను నియమించనున్నట్లు సమాచారం.

IND Vs AUS T20 Series: టీమిండియాకు మళ్లీ కొత్త కెప్టెన్..!! త్వరలో ప్రకటన

టీమిండియా ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌లో బిజీగా ఉంది. ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడటంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యకుమార్ యాదవ్‌ను నియమించనున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతడి పేరును ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ నుంచి స్టార్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు సెలక్టర్లు రెస్ట్ ఇవ్వనున్నారు. దీంతో యువ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియాను సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఈనెల 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. టీ20 సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీ20లలో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో రెండు సిరీస్‌ల వరకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం అందుతోంది. చీలమండ గాయం కారణంగా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నుంచి అతడు ఆడటం లేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-17T20:05:55+05:30 IST