Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-08-22T17:28:39+05:30 IST

ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు. జట్టుకు మద్దతుగా నిలవాలి కానీ, విమర్శలు చేయడం తగదని సూచించారు. కాగా ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన 17 మంది టీమిండియా సభ్యుల్లో చాహల్, అశ్విన్‌కు చోటు కల్పించకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ స్పందించాడు. “అవును. కొంతమంది ఆటగాళ్లు అదృష్టవంతులే. కానీ జట్టు ఎంపిక పూర్తైంది. కాబట్టి అశ్విన్ గురించి మాట్లాడకండి. వివాదాలు సృష్టించడం ఆపండి. ఇది ఇప్పుడు మన జట్టు. మీకు నచ్చకపోతే, మ్యాచ్‌లు చూడకండి. అంతేకానీ అతనిని తీసుకోండి లేదా ఇతడిని తీసుకొండి అని చెప్పడం మానేయండి. ఇది తప్పుడు ఆలోచన.’’ అని గవాస్కర్ అన్నారు.


టీమిండియాకు ఈ ఏడాది ఆసియా కప్ లేదా ప్రపంచకప్ గెలిచే అవకాశాలున్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారని చెప్పుకొచ్చారు. "అవును. ఖచ్చితంగా ఈ జట్టు ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉంది. ఇంకా ఎవరిని ఎంపిక చేస్తారు? తనకు అన్యాయం జరిగిందని ఏ ఆటగాడు ఆరోపణలు చేస్తాడని నేను అనుకోవడం లేదు. 17 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టుకు అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఆసియా కప్‌నకు ఎంపికైన జట్టు మంచి జట్టు. ప్రపంచకప్‌నకు 15 మందిని ఈ జట్టు నుంచే ఎంపిక చేయాలి. భారత్‌కు ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్‌ ముఖ్యం. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఎల్లప్పుడూ కృషి చేయాలి. ఆసియా కప్ ఒక పెద్ద టోర్నమెంట్. కానీ ప్రపంచ కప్ గెలవడం పూర్తిగా భిన్నమైనది. దానిని ఆసియా కప్ విజయంతో పునరావృతం చేయలేము. కానీ వారు ఆసియా కప్ గెలిస్తే చాలా మంచిది. కానీ లక్ష్యం మాత్రం ప్రపంచ కప్ గెలవడమే." అని గవాస్కర్ చెప్పారు.

Updated Date - 2023-08-22T17:28:39+05:30 IST