Broad Retirement: నువ్వు నిజమైన లెజెండ్.. బ్రాడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్ సింగ్

ABN , First Publish Date - 2023-07-30T19:12:11+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా బ్రాడ్‌కు తన విషెస్ తెలియచేశాడు. బ్రాడ్ సంకల్పం స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించాడు.

 Broad Retirement: నువ్వు నిజమైన లెజెండ్.. బ్రాడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్ సింగ్

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా బ్రాడ్‌కు తన విషెస్ తెలియచేశాడు. బ్రాడ్ నిజమైన లెజెండ్ అని, అతని సంకల్పం స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా 37 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ శనివారం తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ ఐదో టెస్టు ఆడుతున్న బ్రాడ్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఈ టెస్టు మ్యాచే తన కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. ‘‘టేక్ ఎ బో స్టువర్ట్ బ్రాడ్. మీ అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు. అత్యుత్తమ, అత్యంత భయంకరమైన రెడ్ బాల్ బౌలర్లలో మీరు ఒకరు. నిజమైన లెజెండ్! మీ క్రికెట్ ప్రయాణం, సంకల్పం చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. జీవితంలో మీ తదుపరి దశ బాగుండాలి." అని యువరాజ్ సింగ్ ట్విట్టర్‌ వేదికగా ట్వీట్ చేశాడు.


కాగా తన 18 ఏళ్ల టెస్టు కెరీర్‌లో బ్రాడ్ అనేక రికార్డులను సాధించాడు. కెరీర్‌లో 167 టెస్టు మ్యాచ్‌లాడిన బ్రాడ్ 602 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రాడ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో పేస్ బౌలర్‌గా ఉన్నాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఉన్నాడు. బ్యాటర్‌గానూ టెస్టుల్లో బ్రాడ్ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 169గా ఉంది. అలాగే 121 వన్డేల్లో బ్రాడ్ 178 వికెట్లు తీశాడు. 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 845 వికెట్లు తీశాడు. కెరీర్ ఆరంభంలోనే ఒకే ఓవర్‌లో 6 సిక్సులు సమర్పించుకున్నప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఆల్‌గ్రేట్ బౌలర్లలో ఒక్కడిగా నిలిచిపోయాడు. కాగా శనివారం రిటైర్మెంట్ ప్రకటించాక విలేకరుల సమావేశంలో బ్రాడ్‌కు 6 సిక్సర్ల గురించిన ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన బ్రాడ్ అది తనకు చాలా కష్టమైన రోజని చెప్పుకోచ్చాడు. ఆ తర్వాత తన ప్రిపరేషన్‌ను వేగవంతం చేశానని, తనకు ఎలాంటి ప్రీ-బాల్ రొటీన్ లేదని తెలిపాడు.

Updated Date - 2023-07-30T19:21:09+05:30 IST