ఘనంగా భోగి సంబరాలు
ABN , First Publish Date - 2023-01-14T22:47:29+05:30 IST
జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో పీఏసీఎస్ చైర్మన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సందెల వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఏసీసీ, జనవరి 14: జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో పీఏసీఎస్ చైర్మన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సందెల వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 2 వందల మంది సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు పెట్టారు. కార్యక్ర మంలో కారుకూరి చంద్రమౌళి, వేముల వీరస్వామి, తూండ్ల సాగర్ యాదవ్, బైరి చంద్రమౌళి, భద్రుద్దిన్, ముస్తఫా, కోడూరి రమేశ్, మంతెన గట్టయ్య, జుపాక సుధీర్, కొలిపాక విగ్నేష్, బాశెట్టి శ్రీనివాస్, గొర్ల సంతోష్, కొంకుముట్టి మహేష్ పాల్గొన్నారు.
నస్పూర్: భోగి సంబరం ఆనందోత్సాహాల మధ్య ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఉదయమే పల్లె, పట్టణాల్లో ఇళ్ళ వాకిళ్ల ముంగిట రంగురంగుల ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళను అందంగా అలంకరించారు. ఆయా ప్రాంతాల్లో వారివారీ ఇళ్ల ఎదుట మహిళలు ముత్యాల ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు. ముత్యాల ముగ్గులను వేసి అందులో రంగులు నింపడంలో మహిళల సృజనాత్మక కళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చిన్నారులకు భోగి పండ్లతో స్నానం చేయించారు.
మందమర్రిటౌన్: పట్టణంలోని భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కాలనీల్లో మహిళలు ఉదయమే ఇండ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. దీంతో కాలనీలన్నీ రంగుల మయంగా మారాయి. పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం రాత్రి బీఆర్‌ఎస్ నాయకులు భోగి మంటలను వేశారు. మంటల చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కార్యక్రమంలోు జె. రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్ పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: మండలంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు ఉదయం ఇళ్ల ముందు రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. చిన్నారులు, యువకులు గాలి పటాలను ఎగురవేశారు.
దండేపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో భోగి పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పలు గ్రామాల్లో ఆలయాల్లో భక్త్తులు భోగి పూజలను నిర్వహించారు.
జన్నారం: మండలంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు గ్రామాలకు చేరుకోవడంతో పండగ శోభ సంతరించుకుంది. యువకులు, చిన్నారులు గాలి పటాలను ఎగురవేశారు. జన్నారంలోని రాఘవేంద్ర లిటిల్ హన్స్ పాఠశాలలో సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించారు. జడ్పీటీసీ చంద్రశేఖర్, కరెస్పాండెంట్ సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భీమారం: మండలంలో భోగి పండగను ప్రజలకు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ముందు మహిళలు, యువతులు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు.
కోటపల్లి: సంక్రాంతి పండగలో భాగమైన మొదటి రోజైన శనివారం భోగి పండగను మండల ప్రజలు కన్నుల పండువగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు రంగ వల్లులు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు గాలి పటాలు ఎగుర వేస్తూ సందడి చేశారు.
కన్నెపల్లి: మండల వ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రేగుపండ్లతో భోగి స్నానాలు చేయించారు.