సరదాల సంక్రాంతి

ABN , First Publish Date - 2023-01-13T22:15:30+05:30 IST

పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంచరించుకున్నాయి. పిండి వంటలు, ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాల సందడి మొదలైంది

సరదాల సంక్రాంతి

నస్పూర్‌, జనవరి 13: పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంచరించుకున్నాయి. పిండి వంటలు, ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాల సందడి మొదలైంది. పిల్లల ఆటాపాటలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు సందడిగా మారాయి. పట్టణాల్లో ఉండే వారంతా కుటుంబ సభ్యులతో సొంత ఊరికి వచ్చారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటాపాటల కోలాహలం, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో సందడి నెలకొన్ననుంది. ఆయా ప్రాంతాల్లో కోళ్ళ పందెలు, ఎడ్లబండ్ల పోటీలు జరుగుతాయి. జిల్లాలోని పల్లె లు. పట్టణ ప్రాంతాల్లో శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి, 16న కనుమ పండుగలు చూడముచ్చటగా జరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఆరు గాలం శ్రమించిన రైతన్న ధాన్యరాశులు ఇంటికి తరలించే కాలం, చేతి నిండా డబ్బు ఇంటి నిండా ధాన్యరాశులతో తులతూగే సమయంలో ఆన్నదాత ఆనందం పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులు బంధుగణం కలిసి ఉత్సహంతో జరుపుకునే పండుగ. రైతన్న ఇంటా నిండైనా పండగ అనుబంధాల కలయిక సంక్రాంతి...

సంస్కృతికి చిహ్నం...

సంక్రాంతి వస్తుందంటే వివిధ రకాల ముత్యాల ముగ్గులు ఇళ్ళ వాకిళ్ళకు సరికొత్త అందాన్ని తెచ్చి పెడుతాయి. ఇంటి ముందు ముగ్గులు వేయడానికి మహిళలు పోటీ పడతారు. ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి అందులో రంగులను నింపి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను, రేగుపండ్లను, ధాన్యంను పెట్టడం సంస్కృతి సంప్రదాయం, సృజనాత్మక నిదర్శనంగా నిలుస్తోంది. ఒక వైపు గంగిరెద్దుల ఆటలు, మరో వైపున హరిదాసుల కీర్తనల సందడితో పండుగ కళ తెచ్చి పెడుతోంది. సందర్బంగా హరిదాసులు రామనామంతో తెల్లవారు జామునే ఇళ్ళ ముందుకు వస్తారు. చేతిలో చిరుతలు, మరో చేతిలో తంబుర వాయిద్యం తలమీద గుమ్మడి కాయ ఆకారంలో అక్షయ పాత్రను పెట్టుకుని నగర సంకీర్తన చేస్తారు. హరిదాసుల సందడితో పల్లె, పట్టణాల్లో సంక్రాంతి పండుగల సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గాలిప టాల ఎగురవేయడంలో పోటీ పడుతారు. పిల్లల నుంచి పెద్దల వరకు పతం గులను ఎగురవేస్తూ సంబరాలను జరుపుతారు. ఆయా ప్రాంతాల్లో పతం గుల పోటీ పడి మరి ఎగురవేస్తారు. పతంగుల ఎగురవేతలో పిల్లల కేరింతలు, ఆనందోత్సవాల నడుమ సంబరాలను జరుపుకుంటారు.

భోగభాగ్యాల భోగి

మూడు రోజుల పండగలో శనివారం వచ్చే భోగి పండగను ఇంద్రుడి ప్రీతి కోసం జరుపుకుంటారని అభిప్రాయపడుతారు. గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతాన్ని గోదాదేవి నియమ నిష్ఠలతో మాసం రోజులపాటు ఆచరించి భగవంతుని అనుగ్రహం పొందింది. గోదాదేవిని రంగనాథస్వామి స్వీకరించిన శుభదినమే భోగి పండగగ పిలువబడుతోంది. వామనావతా రంలో ఉన్న మహావిష్ణువు పాతాళానికి తొక్కిన బలి చక్రవర్తి ఏడాదిలో ఒకసారి భువిపై వచ్చే సమయం కూడా భోగి అని మరో కథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని ఆహ్వానించే క్రమంలో వేసిన మంటలు కాలను గుణంగా భోగి మంటలుగా మారినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున చలి నుంచి తట్టుకునేందుకు భగభగ మంటలు వేయడం వలన భోగి మంటలుగా పేరుగాంచింది. ఆ మంటల సెగలో నీటిని కాచుకుని ఆ నీటితో స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇతర రోజుల కంటే భోగి రోజున వాకిళ్ళు రంగు రంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతారు. భోగి పండ్లతో దేవుడికి నైవేద్యం పెట్టి ఇరుగుపొరుగు మహిళలకు శనగలను వాయినంగా అందజేస్తారు. చిన్న పిల్లలకు చిల్లర నాణేలతో దిష్టి తీసి వేయడం, వారిపై పడిన చెడు దృష్టి తొలగిపోతుందని నమ్ముతారు.

మకర సంక్రాంతి

సంక్రాంతి పర్వదినాన్ని ఆదివారం పల్లెల్లో, పట్టణాల్లో జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. వాకిళ్ళలో రంగు రంగుల ముత్యాల ముగ్గులు, కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య పండుగ సందడి నెలకొంటుంది. శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు, నక్షత్రానికి నాలుగు పాదాలు, మొత్తం 108 పాదాలు, ఆ పాదాలను 12 రాశులుగా విభజిస్తే సూర్యుడు నెలకో రాశిలోకి వెళుతాడు. అదే విధంగా జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వలన మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఇంటి ముంగిట కల్లాపి చల్లి ముగ్గులు వేయడం వలన లోగిలికి అందం చేకూరుతోంది. పల్లెలు వదిలి ఉపాధి కోసం వెళ్ళిన కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు వారి కుటుంబాలతో స్వగ్రామాలకు చేరుకున్నారు.

16న కనుమ

మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరిది సోమవారం కనుమ. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయంలో కీలకంగా వ్యవహరించే ఎద్దులు, ఆవులు, మేకలు రైతుల కుటుంబంలో భాగంగా నిలుస్తాయి. వ్యవసాయ రంగంలో కష్ట, సుఖాల్లో తోడూ నీడగా నిలిచిన పశువులకు ప్రత్యేకంగా పూజించే ఆచారం అనాదిగా వస్తుంది. పండగ రోజున పశువులకు స్నానం చేయించి కుంకుమ, పసుపు, బొట్టు పెట్టి మెడలో పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పాడి పంటల అభివృద్ధికి అనుగ్రహించాలని ప్రార్థిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులతో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు.

మార్కెట్‌కు సంక్రాంతి శోభ

జిల్లాలోని పలు మార్కెట్లలో సందడి నెలకొంది. శుక్రవారం నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను ముగ్గులకు కావాల్సిన రంగుల కొనుగోళ్ళతో మార్కెట్లో బిజీబీజీగా మారింది. నోములకు వినియోగించే చక్కర చిలుకలు, దారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల రంగుల అమ్మకాలు ఊపందుకున్నాయి. రకరకాల రంగులను కొనుగోలు చేసి ఇంటి ముందు ముగ్గులు వేయడానికి మహిళలు పోటీ పడి ముస్తాబు చేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు పతంగులను ఎగురవేయడానికి వివిధ రకాల పతంగులను కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2023-01-13T22:15:32+05:30 IST