రేపటి తరం కోసమే భారత్ భవన్
ABN , First Publish Date - 2023-06-06T02:41:24+05:30 IST
దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు సమర్థ నాయకత్వం రావాలని, ఇందుకోసం భవిష్యత్ తరాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో శిక్షణ అవసరమని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రాజకీయ, సామాజిక రంగాల్లో నేతలకు శిక్షణ
డిజిటల్ లైబ్రరీలు, వసతి కోసం గదులు: కేసీఆర్
కోకాపేటలో 15 అంతస్తుల నిర్మాణానికి భూమిపూజ
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు సమర్థ నాయకత్వం రావాలని, ఇందుకోసం భవిష్యత్ తరాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో శిక్షణ అవసరమని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ భవన్ పేరిట బీఆర్‌ఎస్ నిర్మిస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ భవనానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించనున్నారు. శంకుస్థాపనలో భాగంగా నిర్వహించిన చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లోనూ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని, భావిభారత నిర్మాతలుగా యువతను తయారు చేసే దిశగా భారత్ భవన్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
అందులో భాగంగానే పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్‌ఆర్‌డీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లోని అనుభవజ్జులు, మేధావులను రప్పించి శిక్షణ అందిస్తామని తెలిపారు. దేశంలోని రాజనీతిజ్జులు, ఆర్థిక వేత్తలు, సామాజిక వేత్తలు, సమాజాభివృద్థికి కృషి చేసే రచయితలు, ప్రొఫెసర్లు, విశ్రాంత అధికారులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తద్వారా ప్రజలకు సుపరిపాలన అందించే నాయకత్వాన్ని తీర్చిదిద్ది, భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడకు వచ్చే సామాజిక కార్యకర్తలు, రాజకీయ వేత్తలకు, నాయకులకు భారత్ భవన్‌లో సమగ్ర సమాచారం లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తరగతి గదులు, ప్రొజెక్టర్లతో కూడిన మినీ హాళ్లు, సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్ లైబ్రరీలు, వసతి కోసం లగ్జరీ గదులు నిర్మించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
రాజకీయ, సామాజిక, తాత్విక రంగాలకు చెందిన రచనలు, గ్రంథాలు, వార్తా పత్రికలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగా ల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలను అందుబాటులోకి తెస్తామన్నారు. వార్తా కథనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మీడియా సాంకేతికతతోపాటు సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. అనంతరం ఆయా ప్రదేశాలను స్వయంగా పరిశీలించిన కేసీఆర్.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబిత, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, దామోదర్‌రావు, బడుగుల లింగయ్య యా దవ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూధనాచారి, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్థానిక నేతలతో ఫొటోలు దిగిన కేసీఆర్
నార్సింగ్: సీఎం కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా.. ఆయనతో ఫొటోలు దిగాలని స్థానిక నేతలు ఆరాటపడుతుంటారు. కానీ, భద్రతా వలయం దాటి ఆయనతో ఫొటోలు దిగడం దాదాపుగా అసాధ్యమే. కొన్నిసార్లు స్థానిక ఎమ్మెల్యేలకే చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కానీ, కోకాపేట్‌లో సోమవారం భారత్ భవన్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్.. స్థానిక నేతలతో ఫొటోలు దిగేందుకు ఓకే చెప్పారు. అయితే, ‘పాలన వన్ వే’ పేరిట సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. సీఎంను ప్రజలు కలిసే అవకాశమే దక్కడం లేదన్న అంశాన్ని అందులో ప్రస్తావించింది. తాజాగా కేసీఆర్ ధోరణిలో మార్పునకు ఈకథనం ప్రభావమే కారణమై ఉంటుందని స్థానిక నేతలు చర్చించుకోవడం కనిపించింది.
నేడు నాగర్‌కర్నూల్‌లో సీఎం పర్యటన
సీఎం కేసీఆర్ మంగళవారం నాగర్‌కర్నూల్‌లో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పర్యావరణ పరిరక్షణ.. జీవితంలో భాగం
పచ్చదనం పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో భాగం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్(నియో పోలీస్)లో మూడేళ్ల వయస్సున్న 7.5 అడుగుల ‘పొన్న’ మొక్కను సీఎం కేసీఆర్ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.70 శాతానికి పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం ప్రభుత్వ నిబద్ధతను చాటాయని అన్నారు.