BJP Protest: బీజేపీ నిరుద్యోగ మహాధర్నా

ABN , First Publish Date - 2023-03-25T06:17:35+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం నిరుద్యోగ మహాధర్నాకు సన్నద్ధమైంది.

BJP Protest: బీజేపీ నిరుద్యోగ మహాధర్నా

ప్రజాసంఘాలు, యువజనసంఘాల మద్దతు

ఇది 30 లక్షల కుటుంబాల సమస్య : బండి సంజయ్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం నిరుద్యోగ మహాధర్నాకు సన్నద్ధమైంది. పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో నిరుద్యోగ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహాధర్నాకు హాజరుకానున్నారు. ధర్నాకు యువజన సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని వివరించారు.

కాగా, నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వారందరికీ అండగా ఉంటామని, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకూ వదలిపెట్టబోమని తేల్చిచెప్పారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ పాత్ర లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తే తక్షణం, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణను కోరాలని, సకాలంలో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అన్నారు. తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించని కేసీఆర్‌, రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ప్రశ్నపత్రం లీకేజీలో బీజేపీ పాత్ర ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. లీగల్‌ నోటీసుల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలను అంధకారంలోకి నెట్టడం కేసీఆర్‌ చర్యలకు పరాకాష్ఠ’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-25T15:39:27+05:30 IST