Wrestling Match: కుస్తీ పోటీ జరుగుతుండగానే ఇద్దరు పహిల్వాన్‌లు ఒక్కసారిగా...

ABN , First Publish Date - 2023-10-07T10:35:45+05:30 IST

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య ఘోరంగా కొట్టుకున్నారు.

Wrestling Match: కుస్తీ పోటీ జరుగుతుండగానే ఇద్దరు పహిల్వాన్‌లు ఒక్కసారిగా...

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో (wrestling matches) ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య ఘోరంగా కొట్టుకున్నారు. ఒక పక్క మ్యాచ్ జరుగుతూ ఉండగా.. మరోపక్క ఇద్దరు పహిల్వాన్‌లు దాడులు చేసుకున్నారు. కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.


అసలేం జరిగిందంటే...

గత అర్ధరాత్రి ఎల్బీస్టేడియంలో జరిగిన మోదీ కేసరి దంగల్ కుస్తీ పోటీల్లో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మ్యాచ్ జరుగుతుండగానే అక్కడే ఉన్న ఇద్దరు పహిల్వాన్‌‌ల మధ్య వాగ్వాదం చివరకు గొడవలకు దారి తీసింది. ఒక్కసారిగా ఇద్దరు పహిల్వాన్‌లు, వారితో పాటు వచ్చిన ఇరువర్గాల సభ్యులు కూడా బీభత్సం సృష్టించారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముఖ్యంగా ఓ వైపు పహిల్వాన్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా.. మరోవైపు వారి పక్కన ఉన్న అనుచరులు కూడా దాడికి దిగారు. స్టేడియంలో ఉన్న కుర్చీలు అన్నీ కూడా ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ కుస్తీ పోటీని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు .. ఒక్కసారిగా వివాదం చెలరేగడంతో భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది.


స్థానికులు, పోటీలు నిర్వహించిన నిర్వహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి ఇరు వర్గాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఎవరు ఎవరిపై దాడి చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరగాల్సి ఉండగా.. నిన్నటి ఘర్షణతో అప్పటి వరకు పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈరోజు పోటీలు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-07T10:58:18+05:30 IST