Preeti Case: డాక్టర్ ప్రీతి కేసులో కీలక మలుపు
ABN , First Publish Date - 2023-03-06T15:13:49+05:30 IST
కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ధారావత్ ప్రీతి మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
హైదరాబాద్: కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ధారావత్ ప్రీతి మృతి కేసు (Doctor Preeti Case) లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్యే అని తల్లిదండ్రులు (Preeti Parents) చెబుతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ (Medical Department), వైద్యుల (Doctors) పై ఆరోపణలు గుప్పించారు. మెడికల్ డిపార్ట్‌మెంట్‌పై ప్రీతి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి డీజీపీ (DGP)ని కలిసేందుకు ప్రీతి తల్లిదండ్రులు రాగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో అదనపు డీజీపీ (Additional DGP)ని కలిశారు. ప్రీతికి చేసిన ట్రీమ్ మెంట్‌పై మెడికల్ డిపార్ట్మెంట్ వాస్తవాలు దాచి పెడుతున్నారని అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందని.. ట్రీట్మెంట్ చేసిన వైద్యులను కూడా విచారణ చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
సైఫ్‌తో పాటు మరికొందరు వేధించారన్న తల్లి...
ప్రీతి తల్లి శారద (Preeti Mother Sharada) ఏబీఎన్ (ABN-Andhrajyothy)తో మాట్లాడుతూ... ‘‘నా కూతురిపై జరిగిన వేధింపులపై నాకు చనిపోయే ముందు ప్రీతి కాల్ చేసి చెప్పింది. సైఫ్ వేధింపులపై భయపడవద్దని ప్రీతికి ధైర్యం చెప్పాను. అప్పుడు చివరిగా నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ వైరల్ అయింది. సైఫ్‌తో పాటు మరి కొంతమంది సీనియర్లు ప్రీతిని వేధించారు. వారి ప్రమేయం బయట పడుతుందని, ఈ కేసులో ఇరుక్కుంటామని సైఫ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. డయాలసిస్ చేయడంతో బ్లడ్ మొత్తం పోయింది. అప్పుడే ఎక్కించిన రక్తం నుంచి టాక్సికాలజీ రిపోర్ట్‌కు పంపించారు. దీంతో నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసింది, సైఫ్‌ను లోపల ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ విచారిస్తున్నప్పుడే ఫోన్ చేసింది. నన్ను వేధించకుండా ఉంటే చాలు అమ్మ, సైఫ్‌ను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సమగ్రమైన దర్యాప్తు చేయాలని అడిషనల్ డీజీపీని కోరాము’’ అని తల్లి శారద తెలిపారు.
మాకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు: తండ్రి
తన కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని ప్రీతి తండ్రి నరేందర్ (Preeti Father Narender)పేర్కొన్నారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ (Toxicology report) రాలేదన్నారు. నిన్న మట్టేవాడ పోలీసులు తన ఇంటికి వచ్చి విచారించారన్నారు. ఘటనపై మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు. ఒకవేళ టాక్సికాలజీ వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ తెలియదన్నారు. టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు, అప్పుడే ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టి సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్‌లో ఘటన జరిగిన రోజు ఎంజీఎం (MGM)లో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం తేలేదని ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు.
కాగా.. ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్ అనే మత్తు ఇంజెక్షన్ వయల్స్ పడి ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలతో పాటు, వేరేవైనా విషాలు ఉన్నాయా తెలుసుకునేందుకు హైదరాబాద్ డాక్టర్లు నమూనాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. పదిరోజుల తర్వాత.. ఆ నివేదిక ఆదివారం వరంగల్ పోలీసులకు చేరింది. ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలు కనిపించలేదని ఆ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎలాంటి నిర్ధారణకూ రాలేని పరిస్థితి. ఆమె తల్లిదండ్రులేమో.. తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ ఫోన్ కాల్‌డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.