Falaknuma Express : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ABN , First Publish Date - 2023-07-07T12:57:43+05:30 IST
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలులో పెను ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ట్రైన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడం వలన రైలులో మంటలు అలముకున్నాయని అంతా భావించారు. కానీ ఇంతటి విధ్వంసానికి కారణం ఒక సిగిరెట్ అని తెలుస్తోంది.
యాదాద్రి : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు (Train No - 12703)లో పెను ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ట్రైన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడం వలన రైలులో మంటలు అలముకున్నాయని అంతా భావించారు. కానీ ఇంతటి విధ్వంసానికి కారణం ఒక సిగిరెట్ అని తెలుస్తోంది. ప్రయాణికులు వద్దని వారించినా వినకుండా ఓ ప్రయాణికుడు ఎస్ 4 బోగీలో చార్జర్ పాయింట్ దగ్గర సిగిరెట్ తాగడంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందట.
ఎస్ 4 బోగీలో మంటలను గుర్తించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోయారట. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సికింద్రాబాద్ వస్తుండగా పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. మంటల్లో ఇప్పటి వరకూ 6 బోగీలు కాలిపోయినట్టు సమాచారం. పక్క బోగీలకు మంటలు అలముకోవడంతో ఆ బోగీలను రైలు నుంచి తొలగించారు. మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ బయలుదేరినట్టు తెలుస్తోంది. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు.