ఫార్ములా ఈ రేసా.. మజాకా? చూసేందుకు సచిన్ కూడా వచ్చారు..

ABN , First Publish Date - 2023-02-11T12:31:45+05:30 IST

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ క్వాలిఫైయింగ్ రేస్ ప్రారంభమైంది. గంట 25 నిమిషాల పాటు ఈ రేసు జరగనుంది. దీనిని చూసేందుక పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఇక విదేశీ సందర్శకులు సైతం పోటెత్తారు. ఏకంగా 7 వేల మంది ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ చూసేందుకు వచ్చారు.

ఫార్ములా ఈ రేసా.. మజాకా? చూసేందుకు సచిన్ కూడా వచ్చారు..

హైదరాబాద్ : హైదరాబాద్‌ (Hyderabad)లో ఫార్ములా ఈ కార్ రేస్ ప్రారంభమైంది. గంట 25 నిమిషాల పాటు ఈ రేసు జరగనుంది. దీనిని చూసేందుక పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఇక విదేశీ సందర్శకులు సైతం పోటెత్తారు. ఏకంగా 7 వేల మంది ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ చూసేందుకు వచ్చారు. ఇక క్రికెట్ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఈ రేస్‌ను చూడటానికి రావడం విశేషం. హుస్సేన్‌‌సాగర్ తీరంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. గంటకు 300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోయే ఫార్ములా ఈ కార్ల విన్యాసం చూసేందుకు హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున రేసింగ్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.

మొత్తం 22 మంది రేసర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న ఈవెంట్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఫార్ములా ఈ ప్రాక్టిసింగ్ రేస్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేస్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగుతల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రేసింగ్ చూసేందుకు 21 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. అంతా సవ్యంగానే ఉంది కానీ ఈ రేసింగ్‌ను చూడటానికి వచ్చిన అభిమానులకు వెహికిల్ పార్కింగ్‌కు స్థలం కేటాయించడం మాత్రం నిర్వాహకులు మరిచారు.

ఎంతో ఉత్సాహంగా ఈ రేసింగ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు వెహికిల్ పార్కింగ్ తలనొప్పిగా మారింది. ఈ రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. టికెట్ కొనుగోలు చేసినా వెహికిల్ పాస్ కావాలంటూ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద ప్రేక్షకులను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో టికెట్లు కొన్న రేసింగ్ అభిమానులు అయోమయంలో పడ్డారు. మరోవైపు కార్ పార్కింగ్‌కు నిర్వహకులు స్థలం కేటాయించకపోవడంతో సమస్యలు తలెత్తాయి. తమ వెహికిల్స్‌ను ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో అభిమానులు సతమతమయ్యారు. టికెట్ల కొనుగోలు సమయంలో ఈవెంట్ నిర్వాహకులు వెహికిల్ పాస్ ఇవ్వకపోవడంతో... టికెట్లు కొన్నవారికి పోలీసులతో పార్కింగ్ చిక్కులు ఏర్పడ్డాయి.

Updated Date - 2023-02-11T12:44:33+05:30 IST