దంచికొడుతున్న ఎండలు
ABN , First Publish Date - 2023-06-18T23:55:05+05:30 IST
జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి.

కళ్యాణ్‌నగర్, జూన్ 18: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం భానుడు తన ప్రతాపం చూపించడంతో ప్రజలు విలవిల్లాడిపోయారు.మే నెల కన్నా ఎక్కువగా ఎండలు కొడుతుండడంతో పాటు వడగాలులతో జనం బెంబేలెత్తుతున్నారు. జూన్ మాసం 15రోజులు గడిచినా వానల జాడ లేకపోవ డం, రోజూ 40 డిగ్రీల నుంచి 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 6గంటలకే భాను ప్రతాపం చూపుతున్నాడు. 11గంటలు దాటిన తరువాత జనం రోడ్లపై కనబడని పరిస్థితి నెలకొన్నది. వాతావరణ శాఖ సోమవారం, మంగళవారం కూడా ఎండల ప్రభావం ఉంటుందని, బయట తిరగవద్దం టూ హెచ్చరికలను జారీ చేసింది. రాత్రి 7గంటలు దాటినా భూమి నుంచి వేడి రావడం, రాత్రి ఉష్ణోగ్రత ల్లో కూడా తేమ తగ్గడంతో ఉక్కపోతతో జనం అల్లా డుతున్నారు. రెండు వారాల క్రితం కురిసిన చిరుజల్లులే తప్ప ఇప్ప టివరకు భారీ వర్షాలు పడిన దాఖలాలు లేవు. సింగరేణి ఓసీపీల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగత్రలు అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో మొదటి, రెండవ షిపుల్లో కార్మికుల హాజరుశాతం తగ్గింది. మృగశిర కార్తె వచ్చినా వర్షాలు రావడం లేదంటూ కొన్ని చోట్ల కప్పతల్లి ఆటను నిర్వహిస్తున్నారు. ఆదివారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 42.0డిగ్రీ ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం అత్యధి కం 41.4డిగ్రీలు, అత్యల్పం 29..5డిగ్రీలు, మంగళవారం 42.0డిగ్రీలు, 30.3డిగ్రీలు, బుధవారం 41.6డిగ్రీలు, 31..5డిగ్రీలు, గురువారం 41.0డిగ్రీలు, 30.6డిగ్రీలు, శుక్రవారం 41.6డిగ్రీలు, 28.5డిగ్రీలు, శనివారం 41.6డిగ్రీలు, 29.1డిగ్రీలు, ఆదివారం 42.0డిగ్రీలు, 28.9డిగ్రీలు నమోదు అయ్యాయి. గోదావరి నది పక్కకు ఉండడంతో అందులో నీటి నిల్వతో సముద్ర తీరంలో ఉన్నట్టు ఉక్కపోత ఉంటుంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 30డిగ్రీలు దాటుతున్నాయి. భానుడి ప్రతాపంతో రోడ్లపైకి జనం రావాలంటేనే జంకుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఈనెల 12నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడం, ఉదయం 7గంటలకే భానుడు భగభగ మండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వరకు ఫ్యాన్లు, సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు విలవిలలాడుతున్నారు. వేసవికాలం కంటే ఎండలు ఎక్కువగా ఉండడంతో పిల్లలను స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. పాఠశాలల సెలవులను పొడిగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూళ్లలో ఎండ వేడికి తట్టుకోలేక విద్యార్థులు అస్వస్థతకు గురై పాఠశాల ఆవరణల్లో పడిపోతున్నారు. గతంలో ఎన్నడూ విధంగా జూన్ మాసంలో ఎండలు దంచికొడుతుండడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. మరికొన్ని రోజులు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉంటే గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం 11.30గంటలకే రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. వ్యాపార, వాణిజ్యసంస్థలు వెలవెలబోతున్నాయి.