బీబీసీ అవార్డుల ప్రదానోత్సవంలో కవిత
ABN , First Publish Date - 2023-03-06T03:43:19+05:30 IST
అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఇండియా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలుగు ..
పీవీ సింధు, నిఖత్ జరీన్‌లకు అవార్డులు
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఇండియా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, భారత స్టార్ బాక్సర్, యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. మహిళా దినోత్సవాన్ని పుసర్కరించుకుని వివిధ క్రీడల్లో రాణించిన మహిళలకు బీబీసీ అవార్డులు ప్రదానం చేసింది. బాక్సర్ నిఖత్ జరీన్ తరఫున ఆమె తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్.. కవిత చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అహ్మద్ వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు బాక్సింగ్ క్రీడలో రాణించడం కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నానని ఆయన చెప్పారు. నిఖత్ జరీన్ ఈ స్థాయికి చేరడం వెనుక సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారం ఉందని, లేదంటే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదన్నారు. ఈసందర్భంగా కేసీఆర్, కవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.