తాండూరులో తెరపైకి బీసీ నినాదం
ABN , First Publish Date - 2023-07-29T00:00:15+05:30 IST
తాండూరులో శాసనసభ ఎన్నికల ముందు బీసీ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.బీసీలకే అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘానికి చెందిన అన్ని కులసంఘాల ప్రతినిధులతో డిమాండ్ చేశారు.
బీసీలకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్
వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు
తాండూరు, జూలై 28: తాండూరులో శాసనసభ ఎన్నికల ముందు బీసీ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.బీసీలకే అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘానికి చెందిన అన్ని కులసంఘాల ప్రతినిధులతో డిమాండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలే ఉండడంతో అందరి దృష్టి బీసీ ఓటర్లపైనే పడింది. ఇదిలా ఉంటే బీసీలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ పేర్కొనడంతో ఆయన వ్యాఖ్యలు తాండూరులో సంచలనం రేపాయి. ఆయన ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చింపివేశారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని, ఇంతకు పోలీస్ వ్యవస్థ తాండూరులో ఉందా అని అధికార పార్టీకి చెందిన ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల బీసీవర్గానికి చెందిన నాయకులపై కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. యాలాల మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివా్‌సపై నాన్ బెయిలబుల్ కేసు, యాలాల ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్, బీజేపీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణగౌడ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై స్వయంగా బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ తప్పుబట్టారు. బీసీ వర్గానికి చెందిన బషీరాబాద్ ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్‌పై అవిశ్వాసం, బషీరాబాద్ మండలం అల్లాపూర్, బషీరాబాద్ సర్పంచ్‌లు సస్పెన్షన్ వంటివి బీసీలను వేధించడమేనని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో లక్షా 88వేల మంది బీసీ జనాభా ఉండగా, 6975 మంది జనాభా ఉన్న ఒక వర్గం డామినేట్ చేయడం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత ఎన్నికల్లోనూ బీసీ నినాదం
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీసీ నినాదం తెరపైకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బీసీలను తిట్టారని ఆరోపణలు రావడం చర్చకు దారి తీసింది. దీంతో అన్ని పార్టీలు విమర్శలకు ప్రతివిమర్శలు చేయడం, తర్వాత రోహిత్‌రెడ్డి వివరణ ఇచ్చుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా బీసీ వర్గానికి చెందిన మహారాజ్ కుటుంబానికి పార్టీ టిక్కెట్లు ఇస్తూ వచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన రమేష్ మహారాజ్‌కు రాష్ట్రంలోని మొట్టమొదటగా తాండూరులో కేటాయించినందుకు తనకు ఆరోగ్యం బాగాలేదని టిక్కెట్‌ను త్యాగం చేసి రోహిత్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని సిఫారసు చేశారు. ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రమేశ్ ఆసక్తి చూపుతున్నారు. అయితే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీసీకి చెందిన తనను కాదని ఆయనకు ఏవిధంగా పార్టీ టిక్కెట్ ఇస్తారని రమేష్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీసీసంఘం జిల్లాకు 2 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.