ముస్లిం యువతిపై ఎస్సై జులుం.. ఎస్సై సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-05-11T19:19:38+05:30 IST
జగిత్యాల జిల్లా (Jagtial District) కేంద్రంలో రెండు రోజుల క్రితం బస్ డిపో సమీపంలో ఆర్టీసీ బస్సులో ముస్లిం యువతిపై ఎస్సై చేయిచేసుకున్న సంఘటనలో జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల జిల్లా (Jagtial District) కేంద్రంలో రెండు రోజుల క్రితం బస్ డిపో సమీపంలో ఆర్టీసీ బస్సులో ముస్లిం యువతిపై ఎస్సై చేయిచేసుకున్న సంఘటనలో జగిత్యాల రూరల్ ఎస్సై అనీల్ (SI Anil)ను గురువారం సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈఘటనపై జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేపట్టారు. ఎస్పీ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎస్సై అనీల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి తన తల్లితో కలిసి సిద్దిపేట నుంచి జగిత్యాల వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అదే సమయంలో ఓ మహిళ బస్టాపులో ఉన్న బస్సులో నాలుగైదు సార్లు ఎక్కిదిగారు. సీట్లు ఖాళీగా ఉన్నా.. ముస్లిం యువతి పక్కన వచ్చి కూర్చున్నారు. ‘‘ఆ తర్వాత ముస్లింలు ఇంతే.. అంటూ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నవాళ్లే కదా? అలా ఎందుకు బూతులు తిడుతున్నారని ప్రశ్నించాను. దాంతో వేరే సీట్లోకి వెళ్లి కూర్చుంది’’ అని బాధిత యువతి వెల్లడించారు.
బస్సు బయలుదేరిన కొంత సేపటికి ఆ మహిళ ఎవరికో ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని తెలిపినట్లు చెప్పారు. జగిత్యాలకు చేరే ముందు ఓ పోలీసు వాహనం బస్సు ముందుకు వచ్చి, నిలిచిందని వివరించారు. ‘‘వెంటనే పోలీసు వాహనంలోంచి యూనిఫాం వేసుకున్న ఒక పోలీసు, సివిల్ డ్రెస్‌లో ఉన్న మరో వ్యక్తి దిగారు. వస్తూనే మమ్మల్ని తిట్టారు. దాన్ని వీడియో తీస్తుండగా.. ఫోన్ తీసుకున్నారు. నా ఫోన్ వాళ్ల దగ్గరే ఉంది. నాపై చేయి చేసుకున్నారు. బూటుకాళ్లతో కడుపులో తన్నారు’’ అని ఆమె వాపోయారు. ఆ తర్వాత తనపై దాడి చేసిన వ్యక్తిని జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా, న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ముస్లిం యువతిపై చేయిచేసుకున్న ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జగిత్యాలలో ముస్లిం మైనారిటీ నాయకులు ఆందోళన నిర్వహించారు. టౌన్, రూరల్ ఠాణాల ఎదుట, పాత, కొత్త బస్టాండ్ సర్కిళ్లలో ధర్నా నిర్వహించారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్సీ కవితకు, ఎస్పీ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు.