TSPSC Paper Leak Case: కీలక మలుపు... సిస్టం అడ్మినిస్ట్రేటర్ శంకర్‌లక్ష్మిని ప్రశ్నిస్తున్న సిట్
ABN , First Publish Date - 2023-03-21T21:06:02+05:30 IST
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా అధ్వర్యంలో సిస్టం అడ్మినిస్ట్రేటర్ శంకర్‌లక్ష్మిని విచారిస్తున్న సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని సిస్టం పాస్‌వర్డ్, యూజర్ ఐడీ రాజశేఖర్‌కు ఎలా తెలుసనే విషయంపై ప్రశ్నిస్తున్నారు. డైరీలో ఎక్కడ రాయలేదని ఆమె మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ తన దగ్గర నుంచి పాస్‌వర్డ్ దొంగిలించారని శంకర్ లక్ష్మి చెబుతున్నారు. అయితే శంకర్ లక్ష్మి డైరీ నుంచే పాస్‌వర్డ్ దొంగిలించామని ప్రవీణ్, రాజశేఖర్ చెబుతున్నారు. దీంతో పాస్ వర్డ్ లీక్‌లో శంకర్ లక్ష్మీ పాత్రను నిర్ధారించేందుకు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. శంకర్ లక్ష్మీని ఇది వరకే టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా శంకర్ లక్ష్మీని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరుపుతున్నారు.
టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో ఇప్పటికే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి(Atla Rajashekar Reddy) కీలక సూత్రధారి అని తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్ నుంచి టీఎస్‌పీఎస్సీకి రాజశేఖర్ డిప్యుటేషన్‌పై వచ్చాడని సిట్ నివేదికలో వెల్లడించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ ప్రవీణ్(Pulidindi Praveen Kumar)తో సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడని, కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని సిట్ నివేదికలో తెలిపారు. ఏఈ పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుక(Renuka)కు ప్రవీణ్ అమ్మాడని తేల్చారు.
మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన లేరని తెలియడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్-1లో బీఆర్ఎస్(BRS) నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని రెండ్రోజుల క్రితం బండి సంజయ్ ఆరోపించారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని, దీనికి మంత్రి కేటీఆరే(KTR) బాధ్యుడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కేసీఆర్(KCR) నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ఆయన ప్రశ్నించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని, త్వరలో కేటీఆర్ నిర్వాకాన్ని ప్రజల ముందు పెడతామని బండి సంజయ్ తెలిపారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో సిట్ అధికారులు (SIT Officials) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి (PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు.