Telangana Rains : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
ABN , First Publish Date - 2023-07-27T14:11:57+05:30 IST
తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు.. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు...
తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు.. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకోవైపు కొన్ని ప్రాజెక్టులకు సామర్థ్యాన్ని మించి వరద నీరు చేరడం, మరికొన్ని ప్రాజెక్టులు డేంజర్ జోన్‌లో ఉండటంతో లోతట్లు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు వేలాది మంది ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది.. వరద ఉధృతి తగ్గుతుండటంతో అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. ఇవన్నీ ఇలా ఉండగానే వాతావరణ శాఖ మరో బాంబ్ లాంటి వార్త చెప్పింది. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలు ఈ జిల్లాల్లోనే..
నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో.. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్లతో వీచే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా..
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యంత భారీ వర్షాలు ఇక్కడే..
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవీ..
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ శాఖ క్లైమేట్ విశ్లేషణ చేయడంతో పాటు, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఉదయం 8:30 గంటల ఆధారంగా వాతావరణ విశ్లేషణ చేసింది. నిన్నటి తీవ్రఅల్పపీడనం ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకు అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతోంది. రుతుపవన ద్రోణి ఇవాళ బికానర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిస్సా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ రోజు షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమీ నుంచి 7.6 కిలోమీటర్లు ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.
రాగల మూడ్రోజులు ఇలా..
రాగల 3 రోజుల్లో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. గురువారం, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవే వర్షాలు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇవాళ భారీ నుంచి కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం మాత్రం భారీ వర్షాలు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. రాగల రెండ్రోజులు తెలంగాణలో వాతావరణ శాఖ రెండ్రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాగల 2 రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.