Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఏఏ జిల్లాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-07-27T12:16:32+05:30 IST

తెలుగు రాష్ట్రాలను వాన ముసురు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఏఏ జిల్లాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయంటే..

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వాన ముసురు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి వరద ఉధృతి ఆందోళనకు గురిచేస్తోంది. కూనవరం మండలంలోని 48 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాగునీరు, ఆహారం కోసం కూనవరం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. చింతూరు మండలంలో శబరి నది ఉధృతి భీతి గొల్పుతోంది. 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే ప్రయాణం సాగుతోంది. ఏపీ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.


WhatsApp Image 2023-07-27 at 9.48.26 AM.jpeg

విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖ నగరంలో వర్షం ఉధృతికి కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కంభంలో మట్టిమిద్దె కూలి వృద్ధురాలు ఫాతిమ మృతి చెందింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 1,13,981 క్యూసెక్కులు, తుంగభద్ర పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు, ప్రస్తుతం 1615.56 అడుగుల నీటిమట్టం ఉండటం గమనార్హం. రాజమండ్రి దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరంలో నీటిమట్టం 12.90 అడుగులకు చేరింది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయి ఉన్నాయి. గోదావరి పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


తెలంగాణలో అయితే వానలు ఏపీలో మించి కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉందంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం-కొత్తగూడెం రూట్‌లో రోడ్లపైకి వరద నీరు చేరింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కడెం ప్రాజెక్ట్‌ ప్రమాదపు అంచుల్లో ఉంది. ప్రాజెక్ట్‌ సామర్థ్యాన్ని మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కడెం ప్రాజెక్ట్‌ గేట్లపై నుంచి వ‌ర‌ద‌ నీరు ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగులో 26 అడుగులకు వరద ప్రవాహం చేరింది. వెంకటేష్‌నగర్‌లో ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుంది. బాధితులను తాళ్లతో కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

95ac5cb0-4561-4954-8576-ea624382b258.jpg2bdc8adb-e7fd-4181-912e-793d01aaba8f.jpgd6a299cb-67ae-4d40-8e79-71b3d61245ae.jpg

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద బీభత్సం సృష్టించింది. మోరంచవాగు పొంగడంతో మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. మోరంచపల్లిలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతు కావడంతో గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ఇళ్లు, చెట్లు ఎక్కిన జనాలు ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి. భవనాలపైకి ఎక్కి సాయం కోసం గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రక్షించాలంటూ మోరంచపల్లి గ్రామస్తుల ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మోరంచపల్లి గ్రామస్తుల మొర ఆలకించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్, భద్రాద్రి, ములుగు, వరంగల్‌ జిల్లాలపై వర్ష ప్రభావం అధికంగా ఉంది.

Updated Date - 2023-07-27T12:21:50+05:30 IST