Muthireddy Yadagirireddy: జనగామ బీఆర్‌ఎస్ టికెట్‌పై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-19T14:39:38+05:30 IST

జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Muthireddy Yadagirireddy: జనగామ బీఆర్‌ఎస్ టికెట్‌పై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కీలక వ్యాఖ్యలు

జనగామ: జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే (Palla Rajeshwar Reddy) అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagirir Reddy) శనివారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో ముత్తిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టింది పల్లా రాజేశ్వర్ రెడ్డే అని విరుచుకుపడ్డారు. తన కూతురిని రోడ్డుపైకి తెచ్చింది పల్లానే అని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (Congress Leader Kommuri Pratapreddy) కొడుకు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవని స్పష్టం చేశారు. ఆయన ఎంత ఎత్తు ఉన్నారో అన్ని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా జనగామకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జనగామను హుజూరాబాద్ అంత కాస్లీ ఎన్నికగా మార్చేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారన్నారు. పల్లా అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. పార్టీకి తప్పుడు రిపోర్టులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. కార్యకర్తల మనోభావాలను సీఎం కేసీఆర్ (CM KCR) పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మొదటి లిస్ట్‌లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు.


కాగా.. జనగామ బీఆర్ఎస్‌లో అసంతృప్త సెగలు రాజుకున్నాయి. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మద్దతుగా జనగామ బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ముత్తిరెడ్డి మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. అటు స్టేషన్ ఘనపూర్‌లోనూ కడియంకు టికెట్ ఇవ్వొద్దని రాజయ్య మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

Updated Date - 2023-08-19T14:46:10+05:30 IST