Ake Ravi Krishna: గంజాయి చాక్లెట్లు విక్రయం.. పల్నాడులో ఈగల్ డైరెక్టర్ పర్యటన
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:24 PM
గత ప్రభుత్వ హయాంలో గంజాయి అక్రమ రవాణా పెచ్చురిల్లింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. అయితే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
నరసరావుపేట, డిసెంబర్ 03: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ ఎక్కడైనా ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్జప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్ములనకు ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. డ్రగ్స్ విక్రయించినా.. కలిగి ఉన్నా నేరమే అవుతుందన్నారు. గంజాయి చాక్లెట్లు పట్టుకున్న నేపథ్యంలో నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు.
మంగళవారం ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు, ఎక్సైజ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసరావుపేటలో సోమవారం దాదాపు వందలాది గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆకే రవికృష్ణ అభినందించారు.
సోమవారం అంటే.. డిసెంబర్ 2వ తేదీ నరసరావుపేటలో ఆయుర్వేదం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ ఎక్కడ.. ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేదం రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఆ క్రమంలో ఆకస్మిక దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 175 గ్రాములతో తయారు చేసిన 400 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లలో ఒకరైన ఒడిశాకు చెందిన దయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పని చేసే కార్మికులు, విద్యా్ర్థులే లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో అతడు తెలిపాడు. దయానంద్ పై కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో గంజాయి అక్రమ రవాణా పెచ్చురిల్లింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. అయితే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ ను ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్ గా ఐపీఎస్ సీనియర్ అధికారి ఆకే రవికృష్ణను నియమించింది.
For AndhraPradesh News And Telugu News