Share News

Amaravati : జల సంధానం !

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:38 AM

నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం రాష్ట్రానికి మేలు చేసేలా...

Amaravati : జల సంధానం !

  • గోదావరి-పెన్నా-కావేరీ అనుసంధానం

  • పెన్నా బేసిన్‌కు గోదావరి జల కళ

  • రాయలసీమ కరువు తీరే అవకాశం

  • కడప, చిత్తూరులో కొత్తగా

  • 5 లక్షల ఎకరాల ఆయకట్టు

  • ప్రకాశం, గుంటూరు, నెల్లూరులోని

  • వెనుకబడిన ప్రాంతాలకు జలకళ

  • సాగర్‌ పరిధిలోని మెట్ట ప్రాంతాలను

  • తడపనున్న 80 టీఎంసీలు

  • బొల్లాపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణం..

  • ప్రతిపాదనలతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

  • ఒక ఎకరం కూడా సేకరించాల్సిన పనిలేదు

  • పైప్‌లైన్లు, కాలువల ద్వారానే జలాల తరలింపు

  • రూ. 25వేల కోట్లతో అనుసంధానం పూర్తి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం రాష్ట్రానికి మేలు చేసేలా... మరీ ముఖ్యంగా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తుంది. అక్కడి నుంచి అవుకు, సోమశిల ఫోర్‌షోర్‌ మీదుగా కండలేరుకు గోదావరి జలాలను పంపిస్తారు. అంతిమంగా చెన్నైకు మూడు విడతల్లో 50 టీఎంసీల జలాలు పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా 320 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తారు.

ఈ జలాలను గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిల్వ చేసేలా ఒక రిజర్వాయరు నిర్మిస్తారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీళ్లిస్తూనే .. వెలిగొండ రిజర్వాయరుకు జలాలు చేర్చి అక్కడి నీటి అవసరాలు తీరుస్తారు. ఆపై పెన్నా నదికి నీరు చేరుతుంది. సోమశిల ప్రాజెక్టు ద్వారా తెలుగుగంగకు.. గాలేరు నగరి, హంద్రీనీవా సుజల స్రవంతిలోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడినుంచి అంతిమంగా కావేరికి గోదావరి జలాలు చేరతాయి.

అందుతాయి. సంక్లిష్టమైన నదుల అనుసంధానాన్ని... సులువుగా పూర్తి చేసేలా ఈ ప్రణాళికను రూపొందించారు. గతంలో ఇచ్చంపల్లి నుంచి కావేరి దాకా నదుల అనుసంధాన ప్రక్రియకు వేసిన అంచనా వ్యయం రూ. 95వేల కోట్లు. తాజాగా రాష్ట్రం ప్రతిపాదించిన కొత్త అనుసంధాన ప్రక్రియను రూ.25,000 కోట్లతోనే పూర్తి చేయవచ్చు. భూసేకరణ జంఝాటం లేకుండా.. ప్రస్తుతం ఉన్న పైపులైన్లు, కాలువల ద్వారానే దీనిని చేపట్టవచ్చని రాష్ట్ర జలవనరులశాఖ చెబుతోంది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నారు.

సాగర్‌ ఆయకట్టుకు 80 టీఎంసీలు..

గోదావరి- పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టి .. గోదావరి జలాలను గుంటూరు .. ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు .. తాగునీరందించేలా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోదావరి మిగులు జలాల నుంచి 80 టీఎంసీలను నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో వినియోగించుకునేలా కార్యచరణను రూపొందించింది.


ప్రకాశం, నెల్లూరుకు కొత్తగా 50 టీఎంసీలు

నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 50 టీఎంసీలు అందించవచ్చు. నెల్లూరు జిల్లాలోని సోమశిల పరీవాహక ప్రాంతంలో అదనంగా సాగు, తాగునీరందించేందుకు 20 టీఎంసీలను వినియోగించుకునేలా గోదావరి జలాలను తరలిస్తారు. వెలిగొండకు మరో 30 టీఎంసీలు దక్కేలా డీపీఆర్‌లో ప్రణాళికను రూపొందించింది.

రాయలసీమకు లాభసాటిగా..

గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా రాయలసీమ ప్రాంతం పరిధిలో సాగునీరు, తాగు నీరుదక్కేలా 20 టీఎంసీలు తరలుతాయని సాగునీటి శాఖ పేర్కొంది. హంద్రీనీవాకు మరో 20 టీఎంసీలు గోదావరి జలాలు చేరుతాయని వెల్లడించింది. కడప, చిత్తూరు జిల్లాల్లో మరో ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందేలా 50 టీఎంసీలు దక్కుతాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల గృహాలకు తాగునీటి సమస్య రాకుండా 40 టీఎంసీలను కేటాయించేలా ఈ ప్రణాళిక రూపొందింది. మొత్తంగా గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు 320 టీఎంసీల జలాలు అదనంగా అందుతాయని .. దీనివల్ల కరవుకు ఆస్కారమే ఉండదని రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంటోంది.

గతంలో ఇలా..

ప్రధాని మోదీ... గోదావరి (ఇచ్చంపల్లి వద్ద)- కృష్ణానది-(నాగార్జునసాగర్‌)- కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం బీజేపీ నేత వెదిరె శ్రీరామ్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్సు గతేడాది నవంబరులో సమావేశమై, అనుసంధాన ప్రక్రియపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే, ఈ ప్రతిపాదనలకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తమకు కేటాయించిన గోదావరి నికర జలాల జోలికి వెళ్లడానికి వీల్లేదని తెలిపింది. ఛత్తీ్‌సగఢ్‌ అంతగా వినియోగించుకోని గోదావరి జలాలను అనుసంధాన పథకానికి వాడుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రాలకు కేటాయించిన నదీ జలాలను వాడకుండానే ఈ ప్రక్రియను చేపడతామని శ్రీరామ్‌ హామీఇచ్చారు. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి సాగర్‌ మీదుగా కృష్ణా, పోలవరం వద్ద గోదావరి జలాలను వినియోగిస్తూ సోమశిల గుండా కావేరితో అనుసంధానం చేయడం సాధ్యమయ్యే పనికాదని ఏపీ స్పష్టం చేసింది.

ఇది అంతర్రాష్ట నదీజలాల వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించింది. కేంద్రం ప్రతిపాదన ప్రకారం, రూ.95000 కోట్ల దాకా నిర్మాణ వ్యయం అవుతుంది. ఇందులో భూసేకరణకే రూ.45000కోట్ల దాకా పోతుంది. కేంద్రం ప్రతిపాదనల మేరకు.. నదీ జలాల తరలింపు ప్రక్రియ ఏటా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. అదే సమయంలో సాగర్‌లో కృష్ణాజలాలు 50 శాతానికి మించి ఉంటాయి.

కృష్ణాజలాల ఉధృతికి గోదావరి జలాలు జతచేరితే సాగర్‌పై ఒత్తిడి పెరిగి.. డ్యామ్‌ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో నదుల అనుసంధాన ప్రక్రియ కార్యాచరణ అమలులో కేంద్రం పునరాలోచనలో పడింది. తొలుత మహానది-గోదావరి- కృష్ణా-కావేరి అనుసంధానం చేపట్టాలని, ఆ తర్వాత గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధాన ప్రక్రియపై దృష్టిసారించాలని భావించింది.

అయితే, ఒడిశా సహకరించకపోవడంతో మహానది అనుసంధాన ప్రక్రియ ముందుకెళ్లలేదు. దీంతో, తిరిగి గోదావరి - కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్రం కేంద్రీకరించింది. కానీ, ఇచ్చంపల్లి నుంచి గోదావరి నదీ అనుసంధాన ప్రక్రియను చేపట్టేందుకు తెలంగాణ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ఈ ఆలోచన కూడా ముందుకు సాగదన్న అభిప్రాయం ఏర్పడింది. తాజా ప్రతిపాదనతో తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం ఉండదని... ఆ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం లేకుండా అనుసంధానం పూర్తి చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 03:42 AM