Grant : జడ్పీ నిధులు తిరుగు టపా..!
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:29 AM
పంచాయతీరాజ్ కమిషనర్ నిధులు విడుదల చేసినా.. జడ్పీలో కొందరు సకాలంలో ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో కోట్ల రూపాయలు వెనక్కు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఓటాన అకౌంట్ కింద ఇటీవల విడుదల చేసిన నిధులు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. పీఆర్ కమిషనర్ రూ.1.68 కోట్ల నిధులకు సెప్టెంబరులోనే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ నిధులను మండలాలకు సర్దుబాటు చేస్తూ.. జడ్పీ సీఈఓ చాలా ఆలస్యంగా ...
సెప్టెంబరులో రూ.1.68 కోట్ల గ్రాంట్
జడ్పీ నుంచి నవంబరు 29న మండలాలకు..
ఒక్క రోజులో బిల్స్
సబ్మిట్ చేయలేక నష్టం
సీఈఓ, అకౌంట్స్ విభాగం అధికారుల నిర్లక్ష్యం
అనంతపురం విద్య, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ కమిషనర్ నిధులు విడుదల చేసినా.. జడ్పీలో కొందరు సకాలంలో ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో కోట్ల రూపాయలు వెనక్కు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఓటాన అకౌంట్ కింద ఇటీవల విడుదల చేసిన నిధులు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. పీఆర్ కమిషనర్ రూ.1.68 కోట్ల నిధులకు సెప్టెంబరులోనే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ నిధులను మండలాలకు సర్దుబాటు చేస్తూ.. జడ్పీ సీఈఓ చాలా ఆలస్యంగా ఉత్తర్వులిచ్చారు. మండలాల్లో ఆ నిధులు డ్రా చేసుకోడానికి అవకాశం లేకపోవడంతో ఎంపీడీఓలు బిల్లులు సబ్‌మిట్ చేయలేదని తెలుస్తోంది.
ఫలితంగా కోట్ల నిధులు రద్దేయ్యే ప్రమాదం తలెత్తిందని ఎంపీడీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో జడ్పీ ఉన్నతాధికారుల వైఖరిపై ఎంపీడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబరులో ఉత్తర్వులు
జడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల పాలన సౌలభ్యం కోసం పీఆర్ కమిషనర్ ఓటాన అకౌంట్-2 బడ్జెట్ కింద నిధులు విడుదల చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకూ నాలుగు నెలల కాలానికి ఈ నిధులు ఇచ్చారు. ఇందులో సీనరేజీ గ్రాంట్స్, రూ.8 పర్ క్యాపిటా, ఎంపీడీఓల వాహన అద్దె, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, ఉద్యోగుల టీఏ, డీఏ బిల్లులు చెల్లింపునకు అవసరమైన నిధులు ఉన్నాయి.
నిధులకు గండం
కమిషనర్ ఇచ్చిన గ్రాంట్‌ను ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలకు వెంటనే సర్దుబాటు చేస్తూ సీఈఓ ఉత్తర్వులు ఇవ్వాలి. అలా చేసి ఉంటే.. అన్ని మండలాల అధికారులు ఆ నిధులు డ్రా చేసుకునే వెసలుబాటు ఉండేది. కానీ జడ్పీ అకౌంట్స్ విభాగం అధికారుల నిర్లక్ష్యం, సీఈఓ అలసత్వం కారణంగా గత నెల 11వ తేదీ పేరిట కొన్ని, 30వ తేదీ పేరిట మరికొన్ని ఉత్తర్వులు సిద్ధం చేసి.. గత నెల 29న వాట్సాప్ గ్రూప్‌లో వేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా.. ఒక్క రోజులో ఎంపీడీఓలు బిల్స్ సబ్‌మిట్ చేయడం, ట్రెజరీ వాళ్లు వాటికి ఒకే చెప్పడం అయ్యే పనేనా..? ఇదే కారణంగా చాలా మండలాల్లో ఆ నిధులు డ్రా చేయలేదని సమాచారం. ఈ నెల ఒకటో తేదీ నుంచి సీఎ్‌ఫఎంఎస్ బంద్ అయ్యింది. చాలా మండలాలకు ఆ నిధులు అందకుండానే వెనక్కువెళ్లినట్టయ్యింది. దీంతో ఎంపీడీఓలు మండిపడుతున్నారు. జడ్పీలోని అకౌంట్స్ విభాగంలో అనుభవం లేని ఉద్యోగులను వేసుకోవడం, అకౌంట్స్ విభాగంలో ఓ సీనియర్ అసిస్టెంట్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. బదిలీల సమయంలో చక్రం తిప్పిన ఆయన.. ఆ తంతు ముగియగానే మామూళ్లు బాగా వచ్చే అకౌంట్స్ విభాగానికి వేయించుకున్నారని, అక్కడ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ జడ్పీ పాలనను భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు ఎలాగున్నా, జడ్పీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిపై వివరణ కోరడానికి జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్యకు ఫోన చేయగా.. అందుబాటులోకి రాలేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....