CM Chandrababu Naidu: తప్పు చేయాలంటే వణకాలి.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:32 PM
CM Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలంటేనే వణుకు పుట్టాలి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, పీడీ యాక్ట్‌తో పాటు పోలీసు వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వారిని వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. గత సర్కారు రాజ్యాంగ విరుద్దంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంతో మోసాలు, అక్రమాలకు తెరదీశారని ఆరోపించారు. ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజల్లో చైతన్యం కల్పించామన్నారు. ఈ యాక్ట్‌లో జ్యుడీషియరీ పవర్ అంతా తీసేశారని తెలిపారు. సివిల్ జడ్జిల అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారని.. ఎవరినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్లుగా పెట్టుకునేలా చట్టాన్ని తెచ్చారని పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా భూ యజమాని పేరు మార్చేలా చట్టం తీసుకొచ్చారని.. కింది స్థాయి కోర్టుల్లో ఫిర్యాదులకు తావు లేకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లే పరిస్ధితి కల్పించారని సీరియస్ అయ్యారు.
శిక్ష తప్పదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు చంద్రబాబు. దేశంలో అన్ని రాష్ట్రాలను అధ్యయనం చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం. గ్రామాలు, పట్టణాలు సహా ఎక్కడైనా సరే భూమి కబ్జా చేస్తే ఈ చట్టం వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. కొత్త చట్టం ప్రకారం భూ కబ్జా చేసినా, కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ఎవరైనా కేసు పెడితే భూ కబ్జాదారుడే నిరూపణ చేసుకోవాలని స్పష్టం చేశారు. భూ కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం తెచ్చామని క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా కేసుల విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెడుతున్నామన్నారు చంద్రబాబు. ఎక్కడికక్కడ ప్రత్యేక కోర్టులు పెట్టి 6 నెలల్లో విచారణ పూర్తి చేసి కబ్జాదారులపై శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చామని వివరించారు.
పీడీ యాక్ట్‌కు పదును
పీడీ యాక్ట్‌కు పదును పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో స్టడీ చేసి అందులో పలు అంశాలు చేర్చామన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని తెలిపారు. భద్రత లేకపోతే రాష్ట్రానికి టూరిస్టులు రాని పరిస్దితి తలెత్తుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలీసు వ్యవస్థ గురించి కూడా ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చారని మండిపడ్డారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేశామని చెప్పుకొచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎవ్వరినీ ప్రభుత్వం ఉపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజల కోసం పనిచేయాలి
పోలీసులు ప్రజాహితం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 6,100 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియామకం చేస్తామన్నారు. పోలీసు ఫోర్స్ ఆధునికీకరణ కోసం రూ.61 కోట్లను రిలీజ్ చేశామన్నారు. రూ.99 కోట్లు కేంద్రం నుంచి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. గతంలో సీఎం టూర్లకు ప్రైవేటు వావానాలను బలవంతంగా కబ్జా చేసి అప్రతిష్ట తెచ్చారని దుయ్యబట్టారు చంద్రబాబు. తమ సర్కారు పోలీసులకు 2,812 కొత్త వాహనాల కోసం రూ.280 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పోలీసు సంక్షేమం కోసం రూ.20 కోట్లను విడుదల చేశామన్నారు. పోలీసు అమరవీరులను స్మరించుకునేందుకు రాజధానిలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేసి పటిష్టపరుస్తామని వివరించారు చంద్రబాబు. ఎంతటి వారైనా సరే తప్పు చేయాలంటే భయపడేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు.
Also Read:
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం..
ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
పీఏసీ ఛైర్మన్ పదవికి వైఎస్పార్‌సీపీ నామినేషన్..
For More Andhrapradesh And Telugu News