AP News: రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నట్లు బిల్డప్.. తెర వెనుక చేసేవన్నీ నీచపు పనులే
ABN , Publish Date - Feb 05 , 2024 | 03:41 AM
‘నేను నిప్పు’ అని ఎమ్మెల్యే అంటారు. కానీ ఆయన చేసే వ్యవహారాలు మాత్రం చెత్తగా ఉంటాయి. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప సంపాదించుకోలేదంటారు.

నెల్లూరు జిల్లాకు గుండెకాయ లాంటి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మనిషి చక్కగా ఉంటారు. నడత, హావభావాలు స్టైల్‌గా ఉంటాయి. మాట తీరు మాత్రం గబ్బుగా ఉంటుంది. స్వామి భక్తిని చాటుకోవడానికి విపక్ష నేతలు, పత్రికలపై నోరు పారేసుకోవడం ఆయన నైజం. ఇక దోపిడీ చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
నెల్లూరు జిల్లా కొండల్లో లభించే తెల్లరాయిని ఇష్టానుసారం తవ్వించి కోట్లు కొల్లగొడుతున్నారు. తాడేపల్లికి ప్రతినెలా రూ.15 కోట్లు కప్పం కట్టేలా ఒప్పందం చేసుకుని ప్రభుత్వ, ప్రైవేటు, లీజు క్వారీల్లో దందా సాగిస్తున్నారు. గత మూడు నెలల్లోనే ఏకంగా రూ.450 కోట్లు దండుకున్నట్టు అంచనా. ఇక ఇసుకలోనూ బాగా వెనకేసుకుంటున్నారు.
వేరే జిల్లాకు బదిలీ
ఫ గత ఎన్నికల తర్వాత ఈ ఎమ్మెల్యే పూర్తిగా పెడదారి పట్టారు. అక్రమాలతో పాటు ఆయన వ్యవహారశైలితో స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. చాలామంది నాయకులు, కార్యకర్తలు దూరమయ్యారు. నియోజకవర్గ బదిలీల్లో భాగంగా పార్టీ అధిష్ఠానం ఆయన్ను మరో జిల్లాకు పంపింది.
రాజకీయాల్లో ఆస్తులు
అమ్ముకున్నట్లు బిల్డప్
తెర వెనుక చేసేవన్నీ నీచపు పనులే
తెల్లరాయి కోసం నెల్లూరు గుల్ల
కొండల్ని పిండి చేసి మింగేస్తున్న వైనం
తాడేపల్లికి ప్రతి నెలా రూ.15 కోట్ల కప్పం
3 నెలల్లోనే రూ.450 కోట్ల అక్రమార్జన
ఇసుకాసురులకే ఎసరుపెట్టిన ఘనుడు
అవినీతిలో అన్నతో తమ్ముడి పోటీ
వెంచర్ పక్కనే 6 ఎకరాల కాలువ ఆక్రమణ
కరోనానూ క్యాష్ చేసుకున్న వైనం
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
‘నేను నిప్పు’ అని ఎమ్మెల్యే అంటారు. కానీ ఆయన చేసే వ్యవహారాలు మాత్రం చెత్తగా ఉంటాయి. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప సంపాదించుకోలేదంటారు. ఇది నిజమని నమ్మి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. సహవాస దోషమో ఏమో కానీ.. ఆయన ఇప్పుడు ఎప్పుడో పోగొట్టుకున్న ఆస్తులకు వంద రెట్లు పోగేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, పంట కాలువలు, కొండలు, ఇసుక రీచ్‌లు... వేటినీ వదిలిపెట్టడం లేదు. అడ్డొచ్చినవారు ఎవరైనా, ఎంత సన్నిహితులైనా నిలువునా తొక్కేస్తున్నారు. అధినేత అండదండలతో రూ.కోట్లు దండుకొంటున్నారు.
కరిగిపోతున్న కొండలు
సదరు ఎమ్మెల్యే దాటికి నెల్లూరు జిల్లాలోని కొండలు కరిగిపోతున్నాయి. రోజువారీ కోట్ల రూపాయల ఆర్జనే ధ్యేయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతరుల క్వారీల్లోకి జొరబడి దోచుకొంటున్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొండలనూ పిండి చేసి మింగేస్తున్నారు. ఇక్కడి కొండల్లో లభించే తెల్లరాయి(క్వార్ట్జ్)కి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చెన్నై మార్కెట్‌లో టన్ను క్వాలిటీని బట్టి రూ.36 వేల నుంచి 90 వేల వరకు ఉంది. దీంతో అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు ఈ వ్యాపారంలోకి దిగారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే పార్టీ అధిష్ఠానంతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లాలోని తెల్లరాయి క్వారీలన్నీ తనకు అప్పగిస్తే నెలకు రూ.15 కోట్లు తాడేపల్లికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో క్వార్ట్ ్జ క్వారీలు ఉన్నాయి. గతంలో వీటిలో కొన్నింటిని ఇతరులకు లీజుకు ఇచ్చారు. ఎమ్మెల్యే వీరందరి కడుపులు కొట్టారు. లీజుదారులైనా సరే తవ్వితీసిన తెల్లరాయిని తనకే తను చెప్పిన ధరకే ఇచ్చేలా సంబంధిత శాఖ అధికారుల ద్వారా వారి నుంచి బలవంతపు ఒప్పందం చేయించుకున్నారు. మార్కెట్‌లో తెల్లరాయి టన్ను రూ.70 వేల ధర పలుకుతుంటే ఎమ్మెల్యే రూ.5 వేలకే కొంటున్నారు. కూడదన్న లీజుదారులపై అధికారులతో దాడులు చేయించి కేసు నమోదు చేయిస్తున్నారు.
ఇసుకలోనూ దందా
జిల్లాలోని ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను ఎమ్మెల్యే తీసుకున్నారు. ట్రాక్టరుకు ట్రిప్పు రూ.500, టిప్పరుకు 1500, పెద్ద లారీలకు 2000 చొప్పున వసూళ్లు మొదలు పెట్టారు. జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్క రీచ్ నుంచి రోజుకు సుమారు 700 నుంచి 800 లోడ్ల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. రోడ్లు మరమ్మతుల పేరిట ట్రాక్టరు, లారీ, టిప్పర్లకు సగటున ఒక్కో లోడుపై అదనంగా రూ.750 చొప్పన వసూళ్లు చేస్తున్నట్లు అంచనా. పది రోజుల్లోనే రూ.3 కోట్ల మేర ట్రాన్స్‌పోర్టర్ల నుంచి లాక్కున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్టర్లు జనవరి 22, 23 తేదీల్లో ఇసుక రవాణాను బంద్ చేశారు. రీచ్ నిర్వాహకులకు, ట్రాన్స్‌పోర్టర్లకు మధ్య అధికారులు రాజీ కుదిర్చారు. ట్రాక్టరుకు 200, టిప్పరుకు 500, లారీకి 700 అదనంగా ఇచ్చేలా రాజీ చేశారు. నెలకు 30 నుంచి 40 కోట్ల అదనపు భారం ట్రాన్స్‌పోర్టర్లకు, పరోక్షంగా ప్రజలపై పడనుంది.
అన్న కంటే తమ్ముడు ఘనుడు
దోపిడీలో ఎమ్మెల్యే కంటే ఆయన తమ్ముడు ఘనుడు! పక్క నియోజకవర్గంలో అనధికారిక లే అవుట్ వేశారు. పక్కనున్న పంట కాలువ భూమిని కూడా ఆక్రమించారు. ఆ స్థలం విలువ 50 కోట్లకు పైమాటే. దీనిపై ఆయకట్టుదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా, అధికారులు ఆ ఆక్రమణలను తొలగించలేదు.
కాగా, ఆ ఎమ్మెల్యే మంత్రి అయిన తరువాత ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. గత ఎన్నికల్లో ఆయన్ను భుజనా మోసిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది విసిగిపోయి బద్ద శత్రువులుగా తయారయ్యారు.
అధిష్ఠానం అండతో దోపిడీ
క్వారీల లీజుదారులను భయపెట్టి ఒప్పందం చేయించుకోవడానికి సదరు ఎమ్మెల్యే 5 రోజుల పాటు జిల్లాలోని అన్ని క్వారీల్లో తవ్వకాలు, రవాణా నిలుపుదల చేయించారు. ఈ క్రమంలో నెల్లూరు-చెన్నై జాతీయ రహదారి పొడవునా ఎక్కడపడితే అక్కడ క్వార్ద్జ్‌ని తరలిస్తున్న లారీలను రోడ్లపైనే ఆపేశారు. దీనిపై లీజుదారులు జిల్లాకు చెందిన ఒక వైసీపీ అగ్రనాయకుడికి మొరపెట్టుకున్నారు. వీరందరినీ వెంటబెట్టుకొని అమరావతికి వెళ్లిన ఆ నాయకుడు.. ఒకరి కోసం ఇంత మంది కడుపు కొట్టడం అన్యాయమని అధిష్ఠానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అధిష్ఠానం ఎమ్మెల్యే పక్షానే నిలబడింది. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఎమ్మెల్యే చెలరేగిపోయారు. ఎవరికీ లీజు ఇవ్వని ప్రభుత్వ గుట్టలు, కొండలుగా ఉన్న క్వారీల్లోనూ తవ్వకాలు మొదలు పెట్టారు.
3 నెలలు.. 450 కోట్లు!?
జిల్లాలో లీజు క్వారీలు, అనధిక క్వారీల నుంచి రోజుకు 200-250 లారీల తెల్లరాయి చెన్నైకి తరలిపోతోంది. ప్రైౖవేటు, ప్రభుత్వం, లీజు క్వారీలు అనే తేడా లేకుండా అన్నీ రౌడీ మూకల కాపలా కిందకు వెళ్లిపోయాయి. ప్రైవేటు భూమిలోని క్వారీని సైతం బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా 3 నెలలుగా సాగుతోంది. ఒక లారీకి 33 టన్నులు చొప్పున రోజుకు సుమారుగా 6,600 టన్నుల తెల్లరాయి తరలిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం రోజుకు సుమారు రూ.5 కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.450 కోట్లు దండుకున్నారు. ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మైనింగ్ శాఖ అయితే ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకోసం ఆ శాఖ ఉన్నతాధికారికి భారీగానే ముట్టజెప్పుతున్నారని సమాచారం. మంచి క్వాలిటీ రాయి లభించే ఒక క్వారీలో ఈ అధికారికి 30 శాతం వాటా ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
కరోనానూ క్యాష్ చేసుకున్నారు
కరోనా మహమ్మారిని కూడా క్యాష్ చేసుకున్న ఘనుడు ఎమ్మెల్యే సోదరుడని ప్రజలు చెబుతున్నారు. కరోనా పీక్ దశలో ఉన్న కాలంలో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఆ సమయంలో చిన్న ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ అవకాశాన్ని అన్న పలుకుబడితో తమ్ముడు క్యాష్ చేసుకున్నారు. తను నివాసం ఉన్న పట్టణం పరిధిలో ఉన్న చిన్న, చితక ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వకుండా జిల్లా ఉన్నతాధికారి ద్వారా అడ్డుకున్నారు. ఆ తరువాత ఆ ఆసుపత్రులను ఆయనే లీజుకు తీసుకొని అదే అధికారి ద్వారా కరోనా వైద్యానికి అనుమతులు సంపాదించారు. కరోనా వచ్చిన వారిని, రాని వారిని ఎడా పెడా ఆసుపత్రుల్లో చేర్చుకుని, ఆరోగ్యశ్రీ కింద అడ్డదిడ్డంగా బిల్లులు పెట్టుకున్నారని చర్చ జరిగింది. అంతేగాక రెమిడిసివర్ ఇంజక్షన్లను ఒక్కోదాన్ని 60 నుంచి 70 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.