YSRCP: జగన్‌కు బిగ్ షాక్!
ABN , Publish Date - Aug 29 , 2024 | 05:13 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు.
వైసీపీకి మోపిదేవి గుడ్‌బై ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా
రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ నేడు రాజీనామా
త్వరలో తెలుగుదేశం పార్టీలోకి
అదే దారిలో మరో ఎంపీ మస్తాన్‌రావు
అయోధ్య రామిరెడ్డి, బోస్, బాబూరావూ
వైసీపీని వీడతారని ప్రచారం
మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య కూడా..
పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదనే!
ఇక వైసీపీలో మిగిలే ఎంపీలు వైవీ,
సాయిరెడ్డి, నత్వానీ, నిరంజన్‌రెడ్డే?
మండలి సభ్యత్వానికీ సునీత రాజీనామా
అమరావతి/బాపట్ల/న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు.. చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్‌బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కూడా పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ గురువారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీన్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నట్లు వైసీపీ (YSR Congress) వర్గాలు కూడా వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య, గొల్ల బాబూరావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉండగా.. ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తమను తక్కువ అంచనా వేయొద్దని.. రాజ్యసభలో తమ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారని.. లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారని.. ఉభయసభల్లో పెద్దగా మెజారిటీ లేని బీజేపీ.. తమపై ఆధారపడాల్సిందేనని జగన్, విజయసాయిరెడ్డి ఇటీవలి పదే పదే అంటున్నారు. ఇప్పుడు ఆ బలమే తరిగిపోతుండడం గమనార్హం.
టీడీపీలోకి వెళ్తున్నా: మోపిదేవి
వైసీపీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు మోపిదేవి బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గురువారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన వాస్తవానికి కాంగ్రె్పలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగారు. ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. జగన్ కాంగ్రె్‌సను వీడి వైసీపీని ఏర్పాటు చేశాక మోపిదేవి రాజకీయంగా ఆయన వెంట అడుగులు వేశారు. ఆయనకు అత్యంత సన్నిహతుడిగా మారారు. 2019లో ఆయన రేపల్లె నుంచి పోటీచేసి ఓడినప్పటికీ జగన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత రాజ్యసభకు పంపి కేబినెట్ నుంచి తప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని మోపిదేవి భావించారు. సర్వేలో ఆయన ఓడిపోతారని తేలిందంటూ.. జగన్ వైసీపీ టికెట్‌ను డాక్టర్ ఈవూరు గణేశ్‌కు ఇచ్చారు. అయితే టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజానికి రేపల్లె టికెట్ తనదేననే ధీమాతో మోపిదేవి అక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. తీరా గణేశ్‌కు ఇవ్వడంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు అప్పట్లో తీవ్ర నిరసన వెలిబుచ్చారు. మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. కానీ జగన్ దిగిరాలేదు. గణేశ్ విజయానికి పని చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మోపిదేవి అవమానభారంతో కుంగిపోయారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధిష్ఠానంతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పరాజయం తర్వాత కూడా తన విషయంలో జగన్ అదే వైఖరితో ఉండడం.. పార్టీ కీలక సమావేశాలకు సైతం ఆహ్వానించకపోవడం.. తదితర పరిణామాలు ఆయన పార్టీని వీడేందుకు పురిగొల్పాయి. ఆయన నిష్క్రమణతో వైసీపీకి బలమైన మత్స్యకార సామాజిక వర్గం పూర్తిగా దూరమైనట్లయిందని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
పోతుల సునీత దారెటో...
ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్‌కు, పార్టీ అధినేత జగన్‌కు బుధవారమే ఆమె లేఖలు పంపారు. సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో సునీత వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా వరుదు కల్యాణికి ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపఽథ్యంలో సునీత తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సునీత తన భవిష్యత్ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆమె బీజేపీలో చేరనున్నట్లు అనుచరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి పెత్తందారీ పోకడలు పోతున్న జగన్‌తో విభేదించి ఇద్దరు బీసీ నేతలు గుడ్‌బై చెప్పడం పార్టీపై తీవ్రప్రభావం చూపుతుందని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.