Share News

BPCL Investment : రాష్ట్రంలో భారీ రిఫైనరీ!

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:23 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ముందుకొచ్చింది.

 BPCL Investment : రాష్ట్రంలో భారీ రిఫైనరీ!

  • 75 వేల కోట్ల పెట్టుబడికి బీపీసీఎల్‌ రెడీ

  • సచివాలయంలో సీఎం చంద్రబాబుతో

  • సంస్థ సీఎండీ, ప్రతినిధుల భేటీ

  • చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు

  • 5 వేల ఎకరాలు అవసరమని వినతి

  • ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమ్మతి

  • 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో

  • రావాలని కంపెనీకి సూచన

  • అక్టోబరుకల్లా పూర్తి ఫీజిబులిటీ

  • రిపోర్టుతో వస్తామన్న ప్రతినిధులు

  • రిఫైనరీకి బందరు అనువైన ప్రాంతం!

  • ఇది సాకారమైతే 25 వేల మందికి ఉపాధి

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ముందుకొచ్చింది. చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు బుధవారమిక్కడ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్‌ఫాస్ట్‌ కంపెనీ సీఈవో పామ్‌ సాన్‌ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ రెండు సంస్థల బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన ఆయన.. తొలుత ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుపై బీపీసీఎల్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టుకు 4-5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని వారు ఆయనకు తెలిపారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.

అవసరమైనన్ని భూములు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతో రావాలని కోరారు. అక్టోబరుకల్లా పూర్తి ఫీజిబులిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్‌ ప్రతినిధులు తెలిపారు. విన్‌ఫాస్ట్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. కాగా.. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు. పై రెండు సంస్థల ప్రతినిధులతో సమావేశాల అనంతరం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘దేశంలోని తూర్పు తీరంలో ఉన్న ఆంధ్ర గణనీయమైన పెట్రో కెమికల్స్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈరోజు సీఎండీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని బీపీసీఎల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్‌లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుపై చర్చించాం. 90 రోజుల్లో వివరణాత్మక ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల నివేదిక కోరాను. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. ఎవరికీ ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని పోస్టు పెట్టారు. విన్‌ఫాస్ట్‌ సీఈవోతో కూడా చర్చలు జరిపానని, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆ కర్మాగారం ఏర్పాటుకు అనువైన భూములను సందర్శించేందుకు విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

1BPCL.jpg


ఏడాదికి 12 మిలియన్‌ టన్నుల సామర్థ్యం..

బీపీసీఎల్‌కు ప్రస్తుతం ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బీనాలో రిఫైనరీలు ఉన్నాయి. 2029 నాటికి ఈ సంస్థ సామర్థ్యాన్ని 45 మిలియన్‌ టన్నులకు పెంచుకునేందుకు వీలుగా మరో కొత్త రిఫైనరీని తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయాలని యోచిస్తుండగా.. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పురీని కలిశారు. బీపీసీఎల్‌ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. దానికి కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలోనే బీపీసీఎల్‌ ప్రతినిధులు బుధవారం అమరావతి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే.. దాదాపు 75 వేల కోట్ల పెట్టుబడితో.. ఏడాదికి 12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో ఆయిల్‌ రిఫైనరీని నాలుగేళ్లలో నెలకొల్పేందుకు బీపీసీఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రిఫైనరీ ఏర్పాటుకు బందరు ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా ఇక్కడే ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని, రిఫైనరీ ఏర్పాటుతో బందరు ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, దాదాపు 25 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెబుతున్నారు.

రూ.లక్ష కోట్లకు బీపీసీఎల్‌ సిద్ధం: మంత్రి భరత్‌

రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్‌ సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో బీపీసీఎల్‌ ప్రతినిధుల సమావేశం అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రిఫైనరీ ఏర్పాటుకు మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 90 రోజుల్లో బీపీసీఎల్‌ ప్రతినిధులు మళ్లీ సీఎం చంద్రబాబుతో సమావేశానికి వస్తారని, అప్పుడు రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విన్‌ఫాస్ట్‌ ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గానీ లేదా కృష్ణపట్నంలో గానీ ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పే అవకాశం ఉందని తెలిపారు. ఈ రెండు సంస్థలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు భూమి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Updated Date - Jul 11 , 2024 | 07:04 AM