Share News

వలంటీర్లు ఇచ్చిన డేటాతో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేం..!

ABN , Publish Date - Jun 29 , 2024 | 06:18 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన కులగణన ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ చేపట్టాలంటూ సీసీఎల్‌ఏ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై వీఆర్‌వోలు భగ్గుమంటున్నారు.

వలంటీర్లు ఇచ్చిన డేటాతో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేం..!

  • వారు చేసిన సర్వేకు ప్రామాణికత లేదు.. వీఆర్‌వోల ఆందోళన

విజయవాడ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన కులగణన ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ చేపట్టాలంటూ సీసీఎల్‌ఏ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై వీఆర్‌వోలు భగ్గుమంటున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు టార్గెట్లు నిర్ణయించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకు వెళ్లాలని ఏపీ వీఆర్‌వోల సంఘం రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా కులగణన చేయించారు. అయితే ఇది సమగ్రంగా జరగలేదు.

ఈ క్రమంలో ఎస్సీలను ఓసీలుగా.. ఓసీలను ఎస్సీలుగా నమోదు చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయని వీఆర్‌వోలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లు ఇచ్చిన డేటాను పట్టుకుని ప్రస్తుతం రెవెన్యూ ఉన్నతాధికారులు.. రోజుకు 100 నుంచి 200 వరకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. వీఆర్‌వోల ఆందోళనల నేపథ్యంలో.. విజయవాడలోని ఏపీవీఆర్‌వో సంఘ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం అగ్రనాయకులు కోన ఆంజనేయకుమార్‌, జి.అనుపమ వీర్‌వోల సంఘ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ అంశాన్ని రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

Updated Date - Jun 29 , 2024 | 06:18 AM