Share News

Chandra Babu : కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:34 AM

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.

Chandra Babu : కార్యకర్తలకు అండగా ఉంటాం

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా

3 నుంచి 6 నెలల్లోగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

పోస్టుల పంపకంలో మిత్రధర్మం పాటిస్తాం

దాడులకు ప్రతిదాడులు మా సిద్ధాంతం కాదు

పార్టీలో బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యం

2029లో కూడా అధికారం లక్ష్యంగా పనిచేస్తాం

‘ఆంధ్రజ్యోతి’తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు. తమ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులను 100 రోజుల్లో ఎత్తివేస్తామని తెలిపారు. వారికి మూడు నుంచి ఆరు నెలల్లో నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలన సాగించేలా సహకారం అందిస్తామని, 2029లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తామని వివరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

కార్యకర్తలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు?

పల్లా: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. అక్రమంగా కేసులు బనాయించి అనేక రకాలుగా వేధించి, హింసించారు. వీటికి సంబంధిం చి పార్టీ కేంద్ర కార్యాలయంలో పూర్తి సమాచారం ఉంది. రానున్న 100 రోజుల్లో కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు కృషి చేస్తాం. కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో న్యాయ నిపుణులతో చర్చించి ఏడాదిలోపు ఎత్తివేస్తాం. దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందిస్తాం. వైసీపీ నేతల దాడులతో ఆస్తులు, కుటుంబాలు కోల్పోయిన కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తాం. పార్టీ సహాయ నిధి, ఎన్టీఆర్‌ ట్రస్టు నుంచి అవసరమైన సాయం అందిస్తాం.


కూటమి ప్రభుత్వంలో తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ అంటోంది?

పల్లా: అక్కడక్కడా దాడులు జరిగిన విషయం పార్టీ దృష్టికి వచ్చింది. దాడులకు ప్రతిదాడులు అనేది టీడీపీ సిద్ధాంతం కాదు. ప్రజాస్యామ్యబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి కార్యకర్త సంయమనం పాటించాలి. దాడులు, కవ్వింపు చర్యలను పార్టీ అనుమతించదు.

పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషిచేసిన కార్యకర్తలకు ఎటువంటి న్యాయం చేస్తారు?

పల్లా: ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. ప్రభుత్వంలో వారందరికీ భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించి తగు న్యాయం చేస్తాం. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత కేడర్‌ కొంతవరకు నిర్లక్ష్యానికి గురయ్యారు. అధికారంలో లేనప్పుడు ఒకలా... ఉన్నప్పుడు మరోలా వ్యవహరించకూడదని పార్టీ నిర్ణయించింది. మూడు నుంచి ఆరు నెలల్లో నామినేటెడ్‌ పదవుల పంపకం జరిగేలా కృషిచేస్తా. జనసేన, బీజేపీకి ఇచ్చిన 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంటు స్థానాల్లో సీట్లు ఆశించిన టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి వారి గౌరవానికి తగిన పోస్టులు ఇస్తాం. నామినేటెడ్‌ పదవుల్లో మిత్రధర్మం పాటించి జనసేన, బీజేపీ నాయకులకు భాగస్వామ్యం కల్పిస్తాం.

పార్టీ సభ్యత్వం పెంపు, కార్యకర్తల సంక్షేమంపై ఎటువంటి చర్యలు

తీసుకుంటారు?

పల్లా: దేశంలో అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీల్లో టీడీపీ ఒకటి. రెండేళ్ల కాలానికి ఇచ్చిన సభ్యత్వం వచ్చే డిసెంబరులో ముగుస్తోంది. ఈ పర్యాయం సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తాం. 2029లో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు తగిన విధంగా కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. దీనికోసం సోషల్‌ మీడియాను అన్ని విధాలుగా ఉపయోగిస్తాం. వైసీపీలా కాకుండా సోషల్‌ మీడియా వింగ్‌ను సరైన దారిలో ముందుకు తీసుకువెళతాం.

Updated Date - Jun 18 , 2024 | 05:34 AM