Share News

CM Chandrababu: జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:40 AM

‘‘ప్రజలతో గౌరవంగా ఉండండి. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.

CM Chandrababu: జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన

కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు న్యాయం

వైసీపీ పాలనలో అన్ని శాఖలూ నిర్వీర్యం

వచ్చే రెండేళ్ల నిధులూ ముందే వాడేశారు

ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి

ఆరు నెలల్లోనే పెట్టుబడులు వస్తున్నాయి

సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు

‘రెవెన్యూ’ ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే

15 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటే లక్ష్యం

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలతో గౌరవంగా ఉండండి. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. మానవత్వంతో ఆలోచించి పనిచేయాలని సూచించారు. కలెక్టర్ల సమర్థత వల్లే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ‘‘ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకొచ్చినా, వాటిని మీరే అమలుచేయాలి. మనమంతా ప్రజలకు సేవకులుగా ఉందాం. పీపుల్‌ ఫస్ట్‌ అనేది మన నినాదం కావాలి’’ అని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి గాడిలో పడుతోంది. ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడటానికి భయపడేవారు. ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చింది. బయట ప్రజలు నవ్వుతూ ఉన్నారంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడినట్టే! దీనిని కొనసాగించేలా మన పాలన కొనసాగాలి’’ అని చంద్రబాబు అన్నారు. విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణానికి అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు కూడా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి కాదని, ఈ ప్రభుత్వం వచ్చాక జీతాలు, పెన్షన్లు మొదటి తేదీనే ఇస్తున్నామన్నారు. ‘‘గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. పక్క రాష్ర్టాలకు వెళ్తే ఏపీ గురించి అవహేళన చేసే పరిస్థితికి దిగజార్చారు. ఈ ఆరు నెలల్లో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయి. మళ్లీ రాష్ర్టానికి బ్రాండ్‌ పెరుగుతోంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఇంకా వేగం పెంచాలి. ఇందుకు కలెక్టర్లలో పోటీ వాతావరణం రావాలి. ఇన్నేళ్లలో తొలిసారి ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నాను. రూ.10లక్షల కోట్ల అప్పులు పేరుకుపోయాయి. రూ.లక్ష కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఆదాయం లేదు. అభివృద్ధి జరిగితే సంపద వల్ల ఆదాయం వస్తుంది. పోనీ అప్పులు చేద్దామంటే ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతించలేని దుస్థితి వచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘గతంలో నేను ఎప్పుడూ చూడనిది రేషన్‌ బియ్యం అక్రమ రవాణా. ఈ అక్రమాలను పునాదులతో సహా పెకలించివేయాలి. రెండు నెలల్లో మొత్తం కట్టడి కావాలి. గతంలో పొలం గట్లు కబ్జా మాత్రమే జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్‌లు కజ్జాకు గురయ్యాయి. అందుకే ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తీసుకొచ్చాం. యంత్రాంగంలో ఇంకా పాత వాసనలు పోలేదు. అక్కడక్కడా కొన్ని విషయాల్లో నాకు కూడా తెలియకుండా చేస్తున్నారు. అలాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలి.

- సీఎం చంద్రబాబు

fdgjkhb.jpg


20 పాలసీలు తెచ్చాం

‘‘ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం భూసంబంధిత అంశాలే ఉంటున్నాయి. మద్యం, ఇసుక మాఫియాలతో దోపిడీ చేశారు. దీన్నంతా సరిదిద్దుతున్నాం. అధికారంలోకి రాగానే 20 పాలసీలు ప్రకటించాం. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం. కొత్త పాలసీల వల్ల రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు, 4లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేలకోట్లు ఇచ్చింది. ఇతరత్రా రూపాల్లో రూ.11వేల కోట్లు సమీకరించాం. అమరావతికి ప్రారంభ దశలోనే రూ.50వేల కోట్లు అవసరం. 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం లక్ష్యం. ప్రతినెలా 64 లక్షల మందికి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నాం. సామాజిక పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా ఇప్పటికి 40వేల మందికి ఉచిత సిలిండర్లు అందజేశాం. త్వరలో 16347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తాం. వచ్చే ఏడాది బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు బడుల్లో ఉంటారు’’

ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం..

‘‘విజన్‌ 2047 ప్రారంభిస్తున్నాం. అందులో చాలా లక్ష్యాలు ఉంటాయి. వాటి సాధనకు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. జీఎ్‌సడీపీలో 15ువృద్ధిరేటు సాధించాలి. రాబోయే 25ఏళ్లలో అదే కొనసాగాలి. 2014-19మధ్య ఈ వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో 10.5శాతానికి పడిపోయింది. దానివల్ల రూ.45వేల నుంచి రూ.50వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. ఇప్పుడు మొదటి క్వార్టర్‌లో 9.55ు, రెండో క్వార్టర్‌లో 8.75ు వచ్చింది. అది 15శాతానికి పెరగాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లక్ష్యాలుగా విజన్‌-2047 ఉంటుంది. జీరో పేదరికం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మరో కీలక అంశం. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలి’’

fgh.jpg


పరిష్కారంలో శ్రద్ధ లేదు

‘‘రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. వాటిని తూతూమంత్రంగా నిర్వహిస్తే ఉపయోగం ఉండదు. ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధ కనిపించట్లేదు. రెవెన్యూ, శాంతిభద్రతలు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల్లో ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఆర్థికేతర ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి. పరిష్కారం కాని ఫిర్యాదులకు రికార్డు ఉండాలి. సంక్రాంతి నాటికి రోడ్లపై గోతుల్లేకుండా చేయాలి.’’

గూగుల్‌...గేమ్‌ చేంజర్‌

‘‘గూగుల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో గూగుల్‌ విశాఖవస్తుంది. దానివల్ల విశాఖ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఏజెన్సీలో గంజాయి సాగు ఎక్కువగా ఉంది. గూగుల్‌ శాటిలైట్‌ ఫొటోల ద్వారా 4వేల ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించారు. డ్రోన్లు వాడి వాటిని ధ్వంసం చేయాలి. భూపరీక్షల్లో కూడా గూగుల్‌ సహకారం ఉంటుంది’’


అనుసంధానంతో కరువుకు చెక్‌!

జల సంరక్షణ చర్యలు చేపట్టండి: చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం చేపడితే.. ఒక ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి.. నాలుగేళ్లు కరువు వచ్చినా తట్టుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. జల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. ‘గడచిన ఐదేళ్లలో డ్యాములు, కాలువల యాజమాన్య నిర్వహణ జరగలేదు. గేట్ల మరమ్మతులు పూర్తిగా వదిలేశారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే తిరిగి అమర్చేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపడుతోంది. జలాలు వృథా కాకుండా కాపాడుతున్నాం. రిజర్వాయర్లను నీటితో నింపాం. వచ్చే రెండు సీజన్లలో కనీసం 8మీటర్ల మేర భూగర్భజలాలు ఉండేలా చూసుకోవాలి. నదుల అనుసంధానానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుంది. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని ప్రత్యేక సీఎస్‌ సాయిప్రసాద్‌ వెల్లడించారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తవుతుందని.. సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైతే మరో 3నెలలు పట్టవచ్చని వివరించారు. ఈ సారి వరుణుడు కరుణించడంతో రిజర్వాయర్లు నింపుకోగలిగామన్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగానే ఉన్నాయని.. వాటినెలా ఎదుర్కొనాలన్నదానిపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.

Updated Date - Dec 12 , 2024 | 04:41 AM