Cyber Crime: సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు టోకరా..
ABN , Publish Date - Jul 09 , 2024 | 12:15 PM
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
తిరుపతి: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్. జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసపోయామని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే పాకాల పోలీసులను ఆశ్రయించారు.
ఎమ్మెల్యే మోసపోయిందిలా..!
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడుకి జులై 5న ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసింది. ఫోన్ చేసిన ఆ మహిళ మీ బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించామని చెప్పారు. నాయక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా.. మీ పేరు బయటకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యేకు మహిళ చెప్పింది. మనీల్యాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తామని ఆమె బెదిరింపులకు దిగారు. అనంతరం తన పైఅధికారితో మాట్లాడాలని మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. పైఅధికారినంటూ మాట్లాడిన వ్యక్తి జయదేవ నాయుడుపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జయదేవ నాయుడు చెప్పినా వారు వినలేదు. తాము ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని, చెప్తే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
ఓ అకౌంట్ నంబర్ పంపిస్తామని దానికి రూ.50లక్షలు బదిలీ చేస్తే తనిఖీ చేసిన అనంతరం తిరిగి పంపిస్తామని ఆ వ్యక్తి జయదేవనాయుడుకు చెప్పారు. దీంతో శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే తన ఆరు ఖాతాల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.50లక్షలు వారు చెప్పిన అకౌంట్‌కు పంపించారు. అనంతరం అమెరికాలో ఉన్న తన కుమారుడికి జరిగిన విషయం చెప్పారు. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన ఎమ్మెల్యే కుమారుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు.. తిరుపతి జిల్లా పాకాల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.